Llish Fish: ఏండే పుస్తెలమ్మైనా.. పులస తినాల్సిందేనండి.. ఆయ్
గోదావరి జిల్లాల్లో ఎక్కువగా వినిపించే మాట.. పుస్తెలమ్మి అయినా సరే పులస తినాల్సిందేనండీ ఆయ్ అని.. పులస వస్తుందంటే చాలు.. గోదావరి జిల్లాల ప్రజలు ఎగిరిగంతేస్తారనుకోండి. మరి పులస చేపకు ఎందుకంత ప్రత్యేకత?
పులస చేప పులుసు.. తింటే ఆహా అనాల్సిందే.. వర్షా కాలంలో ఎక్కువగా దొరికే ఈ చేపకు మంచి డిమాండ్ ఉందండి బాబు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు.. జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఈ చేపలు నదీ జలాల్లో సంతానోత్పత్తి చేస్తాయి. జులై, ఆగస్టుల్లో గోదావరి వరద బంగాళాఖాతంలో కలిసే నదీ ముఖద్వారం వద్దకు వస్తాయి. ఇక అక్కడి నుంచి మన గోదావరిలో ఎదురీదుతూ ప్రయాణిస్తాయి. సముద్రంలో ఉన్నప్పుడు వీటిని ఇలసగా పిలుస్తారండి.. గోదవరి నదిలోకి వచ్చాకే.. పులసగా పిలుస్తారు.
ఎదురీదుతూ వస్తుంది.
పులసలు నదీ సంగమాల వద్ద గోదావరిలో ప్రవేశించి ధవళేశ్వరం బ్యారేజ్ వరకు వెళ్తాయి. నదిలో మున్ముందుకు వెళ్లేకొద్దీ వాటి శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. ఇదంతా జూన్ నుంచి ఆగస్టు నెలల మధ్యే జరుగుతుందండి. గుడ్లు పెట్టిన తరువాత మళ్లీ అక్టోబరు నాటికి సముద్రంలో ప్రవేశిస్తాయి. గోదావరి వరదనీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి. గోదావరి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచీ మారి పులసగా మారుతోందని చెబుతారు.
ఈ చేపలో కొవ్వు సముద్రంలో ఉన్నప్పుడు 12.4 శాతం వరకూ ఉంటే నదీ ముఖద్వారం వద్దకు వచ్చినప్పుడు 17.3 శాతానికి పెంచుకొని సంతానోత్పత్తికి సిద్ధమవుతుందట. గోదావరిలో ఎదురీదే సమయంలో ఆహారం తీసుకోకుండా తన శరీరంలోని శక్తినంతా కూడగట్టుకొని వెళ్తుంది. అలా ముందుకొచ్చేకొద్దీ ఈ చేపలోని కొవ్వు తగ్గిపోతూ వస్తుంది. ఎంతలా అంటే 14.50 నుంచి 8.78 శాతం వరకు తగ్గినట్లు పరిశోధనల్లో తేలింది.
రుచి అందుకేనండి..
గోదావరిలోని తీపి నీరు, సముద్రంలోని ఉప్పునీరు కలవడం వల్ల ఈ చేపలకు ప్రత్యేక రుచి వస్తుంది. సముద్రంలో ఉండే ఇలస. గోదావరికి ఎదురీది ధవళేశ్వరం చేరేసరికి పులసగా మారే క్రమం ఈ నీటి మార్పు వల్లే జరుగుతుంది. ప్రతి సీజన్లో పులస చేపల వ్యాపారం లక్షల్లో జరుగుతుంది.
ఈసారి తగ్గాయండి..
గోదావరికి వచ్చే పులస చేపల లభ్యత ఈసారి తగ్గిపోయింది. సముద్రంలో చమురు, సహజవాయువు కోసం చేసే పనులతో సంతానోత్పత్తి కోసం వచ్చే ఇలసలు గోదావరి వైపు రాకుండా పోతున్నాయి. సముద్రంలో ఇలస చేపల వేట ఎక్కువగా ఉండటం కూడా.. తక్కువగా రావడానికి కారణవుతోంది. పులస ఒక ఏడాదిలో కేజీ బరువు పెరుగుతుంది. ఇంకా ఎక్కువగా కావాలంటే.. రెండు మూడేళ్లు పడుతుంది. ఈ కలుషిత జలాల కారణంగా సంతానోత్పత్తిపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.
పులసలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈసారి 7 వేల నుంచి 10 వేల వరకు ధర పలుకుతోంది. కానీ లభ్యతే తక్కువగా ఉంది. అందుకే ధర పెరిగినట్లు చెబుతున్నారు.
also read: Electric Cycle: పెట్రోల్ ధరలకు ఓ నమస్కారం పెట్టి ఈ కరెంట్ సైకిల్ కథ వినండి..!