Tirumala Roja Driver : అక్రమంగా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించిన రోజా డ్రైవర్ - తప్పు చేయలేదని రోజా సమర్థన !
శ్రీవారి ఆలయంలోకి నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశించారు మంత్రి రోజా డ్రైవర్. సీసీ కెమెరా దృశ్యాలు ఉన్నా... తన డ్రైవర్ తప్పు చేయలేదని రోజా సమర్థించుకున్నారు.
Tirumala Roja Driver : తిరుమల వీఐపీల ఇష్టారాజ్యంగా మారిపోతోందనే విమర్శలు వస్తున్నాయి. నిన్నటికి నిన్న నయనతార, విఘ్నేష్ శివన్ జంట ఏకంగా ఫోటోషూట్ పెట్టుకున్నారు. ఈ వివాదం సద్దుమణగక ముందే మంత్రి రోజా సిబ్బంది నిబంధనలు పాటించకుండా ఆలయంలో ఇష్టారీతిన తిరిగేస్తున్నారు. సంప్రదాయ దుస్తులు లేకుండా.. అనుమతులు లేకుండా నేరుగా మహాద్వారం గుండా దర్శనానికి వెళ్లి వచ్చారు. ఈ విషయం భక్తులు ఫోటోలు, వీడియోల ద్వారా బయట పెట్టారు. డ్రైవర్‌ను లోపల విజిలెన్స్ సిబ్బంది కూడా నిలదీశారు.
వీఐపీ బ్రేక్‌లో టీషర్ట్, ఫ్యాంట్‌తో మహాద్వార దర్శనానికి వెళ్లిన రోజా డ్రైవర్
మంత్రి ఆర్కే రోజా వారానికో సారి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వస్తూంటారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె వెంట వచ్చే వారు ఎక్కువయ్యారు. ఇలా వస్తున్న వారు రోజాతో పాటు వీఐపీ దర్శనానికి వెళ్లిపోతున్నారు. శనివారం అలా శ్రీవారి దర్శనానికి వెళ్లిన రోజా ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ టిటిడి నిబంధనలకు విరుద్దంగా వి.ఐ.పి బ్రేక్ లో టీ షర్ట్, ఫ్యాంట్ వేసుకుని నేరుగా మహా ద్వారం గుండా ఆలయ ప్రవేశం చేశారు.
సామాన్యులు నిలదీసి.. విజిలెన్స్‌కు అప్పగించిన తర్వాత స్పందన
ఇలా టీ షర్ట్, ఫ్యాంట్ తో ఆలయ ప్రవేశం చేసిన వ్యక్తిని వెండి వాకిలి వద్ద టిటిడి విజిలెన్స్, టిటిడి ఆలయ సిబ్బంది గుర్తించి అడ్డుకున్నారు.. దీంతో తానూ మంత్రి రోజా ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ నని చెప్పడంతో భద్రతా సిబ్బంది వదిలి పెట్టేశారు. సామాన్య భక్తులు పట్టుకుని, విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకుని, ప్రశ్నలు మీద ప్రశ్నలు వేసి ప్రతాపం చూపే టిటిడి విజిలెన్స్ సిబ్బంది మంత్రి గారి మనిషి అనగానే ఎటువంటి ప్రశ్నలు వేయకుండా వదిలి పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
సీసీ కెమెరాల్లో చిక్కినా.. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని రోజా విమర్శలు
ఈ వివాదం కలకలం రేపడంతో మంత్రి రోజా స్పందించారు. అయితే ఆమెవిచిత్రమైన సమాధానం చెప్పారు. తన ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ మహా ద్వారం గుండా ఆలయ ప్రవేశం చేయలేదని వాదించారు. తనపై అనవసరంగా అసత్య ప్రచారం చేస్తున్నారని, తన సిబ్బంది ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా ఎప్పుడూ నడుచుకోలేదని రోజా తన సిబ్బందిని వెనకేసుకుని వచ్చారు. స్పష్టంగా వీడియో సాక్ష్యాలు ఉన్నా రోజా తన ఎస్కార్ట్ డ్రైవర్‌ను అడ్డగోలుగా వెనుకేసుకు రావడంతో మీడియా ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయారు. మంత్రి కూడా అలా అనడంతో టీటీడీ కూడా ఎలాంటి చర్యలు తీసుకనే అవకాశం లేదని తెలుస్తోంది.