AP Gurukul Seats : ఏపీ గురుకులాల్లో సీట్ల కోసం డిమాండ్ -భర్తీ కోసం మంత్రి ఏం చెప్పారంటే ?
ఏపీ గురుకుల స్కూల్స్‌లో అర్హత ఉన్న ఎస్సీ విద్యార్థులకు అవకాశాలు కల్పించాలని మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు.
AP Gurukul Seats : ఆంధ్రప్రదేశ్ ఎస్సీ గురుకుల పాఠశాలల్లో సీట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గురుకులాలకు ప్రభుత్వం మంజూరు చేసిన 640 సీట్ల సంఖ్య పెరగకుండా మాత్రమే అడ్మిషన్లు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ అంశంపై మంత్రి మేరుగ నాగార్జున సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హత కలిగిన ప్రతి విద్యార్థికీ అవకాశాన్ని బట్టి సీట్లు కేటాయించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎస్సీ హాస్టళ్లపై నిరంతర పర్యవేక్షణ చేయాలని, పదవ తరగతి విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. సచివాలయంలో బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లకు డిమాండ్ ఏర్పడిందన్నారు.
బీ.ఆర్. అంబేద్కర్ గురుకులాల్లో సీట్ల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడి ఒత్తిడి పెరిగిందని అయితే 640 సీట్లు మాత్రమే ఉన్నాయన్నారు. గురుకులాల్లో ఎక్కడ కూడా సీట్లు ఖాళీగా మిగిలిపోకుండా అర్హత కలిగిన ప్రతి విద్యార్థికీ అడ్మిషన్ ఇవ్వాలని కోరారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు, విద్యాబోధన కోసం టీచర్లు ఉండేలా చూసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. గురుకులం సీట్లకు ఎక్కువ డిమాండ్ కలిగిన జిల్లాల డీసీఓలు, డిడిలు, గురుకులం అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ఎస్సీ హాస్టళ్లు వెనుకబడ్డాయని, సరైన స్థాయిలో ఫలితాలు రాకపోవడానికి కారణం హాస్టళ్లపై అధికారులు పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టకపోవడమేనని అభిప్రాయపడ్డారు.
జిల్లాల స్థాయిలో ఉండే డీడీలు కింది స్థాయి అధికారులపై బాధ్యత మొత్తం వదిలేయకుండా తాము కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లి హాస్టళ్లను ఆకస్మిక తనిఖీలు చేయాలని, 24 గంటలూ హాస్టళ్లపై పర్యవేక్షణ ఉండేలా చూడాలని ఆదేశించారు. హాస్టల్ వెల్ఫేర్ అధికారులు హాస్టళ్లలోనే నివాసం ఉంటూ విద్యార్థులు చదువుకొనేలా చూడాలని కోరారు. 9వ తరగతిలోకి వచ్చిన విద్యార్థులకు ముందస్తుగా పదవ తరగతి పాఠాలపై అవగాహన కల్పించాలని, ట్యూటర్లను పెట్టుకొని విద్యాబోధన చేయించడం ద్వారా మంచి ఫలితాలను సాధించడానికి కృషి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో ఉండే సాంఘిక సంక్షేమశాఖ అధికారులు కూడా హాస్టళ్లను సందర్శించి వాటిలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
హాస్టళ్లలో పలుచోట్ల మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉందని తన దృష్టికి వచ్చిందని చెప్పారు. హాస్టళ్ల రిపేర్లకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయించి తన దృష్టికి తీసుకురావాలని కోరారు. దీనికి సంబంధించి అన్ని జిల్లాల డీడీలతో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నాగార్జున అధికారులను ఆదేశించారు.