Gottipati Ravikumar : సమర్థునికి, అసమర్థునికి అదే తేడా - జగన్ హయాంలో విద్యుత్ ఘోరాలను వెల్లడించిన మంత్రి గొట్టిపాటి
Andhra Pradesh : జగన్ హయాంలో జరిగిన విద్యుత్ ఘోరాల వివరాలను మంత్రి గొట్టిపాటి అసెంబ్లీకి వివరించారు. జగన్ చెత్త పన్ను వేస్తే తాము చెత్త నుంచి కరెంట్ తీశామన్నారు.
Minister Gottipati Ravikumar : చెత్త మీద పన్ను వసూలు చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డిది అయితే... అదే చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడిదని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. 2014 లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. 2014-2019 మధ్య కాలంలో తీసుకున్న నిర్ణయాలతోనే ఏపీ మిగులు విద్యుత్ రాష్ట్రంగా అవతరించిందని గుర్తు చేశారు. అనంతరం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో విద్యుత్ రంగాన్నిఅస్తవ్యస్థంగా మార్చిందని పేర్కొన్నారు.
అనాలోచిత నిర్ణయాలతో ప్రజలపై భారం
“2013-2014 సమయాల్లో తీవ్రమైన కరెంట్ కోతలు ఉండేవి. రాత్రిపూట విద్యుత్ వినియోగిస్తే జరిమానాలు విధించే వారు. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, పాలసీలను రద్దు చేయడం వల్ల విద్యుత్ లోటు ఏర్పడింది. రోజు రోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతున్నా కానీ... ప్రజావసరాలకు కావాల్సినంత విద్యుత్ ను ఉత్పత్తి చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలం అయ్యింది. ఫలితంగా వినియోగదారుల పైన భారం పడింది. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. ఈ నిర్ణయంతో నష్టపోయింది ఎక్కువగా పేద, మధ్య తరగతి కుటుంబాలే. 2014-19 లో 50 యూనిట్లు కాల్చే వారికి రూ.100 కరెంట్ బిల్లు వస్తే... 2019-24 మధ్య కాలంలో రూ.199 పెరిగి 98 శాతం భారం వారి మీద పడింది. 100 యూనిట్లు వినియోగించే వారిపై 86 శాతం, 200 యూనిట్లు వినియోగించే వారిపై 78 శాతం భారం పడిందని” మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.
చంద్రబాబు నాయుడు ముందు చూపుతూనే మిగులు విద్యుత్
“2014-19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ముందు చూపుతో విటీపీఎస్, కృష్ణపట్నంలో 800 మెగావాట్ల ఉత్పత్తికి పవర్ ప్లాంట్లు పెట్టినట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండలిలో తెలిపారు. వాటిని సరిగా వినియోగించుకోలేకపోవడం కారణంగా రూ. 4000 కోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ను సకాలంలో అందుబాటులోకి తీసుకుని వచ్చి ఉంటే అదనంగా 960 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చేదని అన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్లే 960 మెగావాట్ల విద్యుత్ ను ఏపీ ప్రజలు కోల్పోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
సమర్థునికి, అసమర్థునికి అదే తేడా
“టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు రెన్యువబుల్ ఎనర్జీని ప్రోత్సహించారు. సోలార్, విండ్ ఎనర్జీల ద్వారా 6500 నుంచి 7500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకుని వచ్చారు. గత ప్రభుత్వం తీసుకున్న పీపీఏల రద్దు నిర్ణయం కారణంగా ఒక్క మెగావాట్ విద్యుత్ కూడా ఉత్పత్తి కాలేదు. జగన్ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేఖిస్తూ విదేశీ సంస్థలు కేంద్రానికి పలుమార్లు లేఖలు రాశాయి. తక్కువ రేటుకు లభించే విద్యుత్ ను వదులుకుని, రెట్టింపు రేటుకు విద్యుత్ ను కొనుగోలు చేసింది జగన్ ప్రభుత్వం. ఒక అసమర్థుడు ఐదేళ్లు పరిపాలిస్తే విద్యుత్ వ్యవస్థ ఎంత అథోపాతాళానికి చేరుతుందో జగన్ మోహన్ రెడ్డి నిరూపిస్తే.. ఒక సమర్థవంతుడు ఐదేళ్లు పరిపాలిస్తే మిగులు విద్యుత్ రాష్ట్రంగా మలచవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరూపించారని” మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వివరించారు.