Minister Ambati Rambabu: ఈ ఏడాది వీరు వరి సాగు చేయకండి - ఆ ప్రాంత రైతులకు మంత్రి అంబటి సూచన
సాగర్ ఆయకట్టు కింద ఈసారి ఆరుతడి పంటలు వేసుకోవాలని, వరి పంట వేయొద్దని మంత్రి అంబటి రాంబాబు సూచించారు.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి చర్చనీయాంశంగా వ్యాఖ్యలు చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు వరిసాగు చేయవద్దని సూచించారు. వర్షాలు తక్కువగా పడటంతో సాగర్ లో ఆశించిన స్థాయిలో వరద నీరు రాలేదని వరి సాగుపై రైతులు ఆలోచించుకోవాలని అన్నారు. సాగర్ ఆయకట్టు కింద ఈసారి ఆరుతడి పంటలు వేసుకోవాలని, వరి పంట వేయొద్దని చెప్పారు. నాగార్జున సాగర్ నీటిపై ఆధారపడిన భూముల్లో ఆరుతడి పంటలు వేసుకోవడం తప్ప శరణ్యం లేదని అన్నారు. వారాబంది పద్ధతిలో నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. దీనిపై ఈ నెల 1న ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడానని చెప్పారు.
టీడీపీ అధినేత చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. తనను అరెస్టు చేస్తారని చెప్పి ప్రజల్లో సానుభూతిని పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తప్పుచేసినందునే చంద్రబాబు భయపడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. చంద్రబాబు నిప్పో తుప్పో మీకు తెలుసు, చూసే ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. చంద్రబాబును అరెస్టు చేయాల్సిన అవసరం ఉంటే అరెస్టు చేస్తారు, అరెస్టు చేయాల్సిన అవసరం లేకపోతే అరెస్టు చేయరని అన్నారు.
చట్టం దృష్టిలో చంద్రబాబు అయినా మరో బాబు అయిన ఒకటేనని అంబటి అన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూపోతుందన్నారు. చంద్రబాబు తప్పు చేసినందునే భయపడుతున్నారని అరెస్ట్ చేస్తారని ఆయనకు కలవచ్చినట్టుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రాథమిక ఆధారాలు లేనిదే ఎవరి మీద ఏ విధమైన కేసులు పెట్టరని అన్నారు అంబటి రాంబాబు. చంద్రబాబు 118 కోట్లు ముడుపులు తీసుకున్నారని, ఆధారాలున్నా పవన్ కళ్యాణ్ నోరు విప్పడని అంబటి విమర్శించారు.
చంద్రబాబు దొంగ అయినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒప్పుకోడన్నారు. హీరో అనే అంటాడని అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. కారణం వారిద్దరి మధ్య ఉన్న సంబంధం అలాంటిదన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్.. పెద్ద రాక్షసుడు, చిన్న రాక్షసుడు, దత్త రాక్షసులని విమర్శించారు.