Chandrababu Naidu Oath Ceremony: ఓ ఆత్మీయత, ఓ భావోద్వేగం, అంతులేని అభిమానం - చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో గుర్తుండిపోయే క్షణం
Chandrababu Oath Ceremony: చంద్రబాబు నాలుగోసారి ఏపీ సీఎంగా బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో సభా వేదికపై కొన్ని అరుదైన, ఆత్మీయ ఘట్టాలు చోటు చేసుకున్నాయి.
Memorable Moments In Chandrababu Naidu Oath Ceremony: అవును.. అందరి కళ్లల్లోనూ ఆనందం. గత ఐదేళ్లలో ఎన్నో ఇబ్బందులు పడి.. ఒడుదొడుకులు ఎదుర్కొని పడి లేచిన కెరటంలా తిరిగి సీఎంగా తన భర్త ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆ క్షణం ఆయన భార్యకు చెప్పలేని ఆనందం. నా తమ్ముడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడన్న ఆనందం ఆ అన్నకు.. నా భర్త ప్రజల మన్ననలు పొంది రాష్ట్ర నేతగా ఎదిగాడనే ఆనందం ఆ భార్యకు.. మా నాన్న అమాత్యునిగా ప్రమాణం చేశారన్న ఆనందం ఆ బిడ్డలకు. సోదరిని ఆత్మీయంగా ముద్దాడిన అన్న. ప్రమాణం అనంతరం తన అన్న కాళ్లకు నమస్కరించిన తమ్ముడు. ఇవీ చంద్రబాబు ప్రమాణస్వీకారంలో కొన్ని మధుర ఘట్టాలు.. గుర్తుండిపోయే క్షణాలు. అవి ఎవరికి గుర్తుండినా ఉండకపోయినా.. వారికి మాత్రం వారి మనసుల్లో చిరకాలం గుర్తుండిపోతాయి. చరిత్రలో కనివినీ ఎరుగని ఘన విజయంతో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్లాలని అంతా ఆకాంక్షిస్తున్నారు.
చంద్రబాబు భావోద్వేగం
తొలుత ఒకే కారులో ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా సభ మొత్తం నినాదాలతో మార్మోగింది. అనంతరం చంద్రబాబు నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ప్రధాని మోదీని వేదికపై చంద్రబాబు ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, చంద్రబాబును ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు.
చెల్లెలికి అన్న ఆత్మీయ ముద్దు
చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముందు వేదికపై ఓ ఆసక్తికర ఘటన జరిగింది. వేదికపై ఆశీనురాలై ఉన్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని అన్న బాలకృష్ణ ఆత్మీయంగా పలుకరించారు. అనంతరం ఆమె నుదుటిపై ఆత్మీయంగా ముద్దుపెట్టారు.
పవన్ అనే నేను..
అనంతరం ఏపీ మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన తన అన్న మెగాస్టార్ చిరంజీవి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. పవన్ ప్రమాణం చేస్తున్నంత సేపు అభిమానులు, ప్రజలు కేరింతలు, నినాదాలు, కేకలతో సభ మొత్తం మార్మోగిపోయింది. ఈ క్రమంలో కొత్త ఉత్సాహం నెలకొంది. పవన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన సతీమణి అన్నా లెజీనోవా ఆనందంతో మురిసిపోయారు. అదే సమయంలో పవన్ బిడ్డలు అకీరా, ఆద్యాలు సంతోషంతో వీడియోలు తీశారు.
నారా లోకేశ్ అనే నేను..
చంద్రబాబు, పవన్ అనంతరం నారా లోకేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన భార్య నారా బ్రాహ్మణి, ఆయన కుమారుడు దేవాన్ష్ ఉత్సాహంతో చప్పట్లు కొట్టారు. ప్రమాణం అనంతరం లోకేశ్ తన తండ్రి చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఇతర ప్రముఖులను ఆప్యాయంగా పలుకరించారు. ఆ తర్వాత తన మామయ్య బాలకృష్ణ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.
పేరు పేరునా ప్రధాని అభివాదం
సీఎంగా చంద్రబాబు, మంత్రులుగా పవన్, నారా లోకేశ్, అచ్చెన్నాయుడుతో పాటు ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని మోదీ వేదికపై ఉన్న వారందరినీ పేరు పేరునా ఆత్మీయంగా పలుకరించారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్‌లతో కలిసి ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేశారు. దీంతో సభ మొత్తం మార్మోగిపోయింది. అనంతరం మోదీ సూపర్ స్టార్ రజనీ దంపతులకు నమస్కారం చేశారు. అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, బాలకృష్ణ, తమిళనాడు మాజీ సీఎం పనీర్ సెల్వం, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఇలా అందరినీ పేరు పేరునా పలుకరించారు.