Mangalagiri News : మెడికల్ టూరిజం కేంద్రంగా భారత్, వైద్య రంగంలో సమూల మార్పులు - కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్
Mangalagiri News : భారతీయ వైద్య విధానంలో కీలక మార్పులకు ప్రధాని మోదీ ప్రభుత్వం నాంది పలికిందని కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. భారత్ మెడికల్ టూరిజంలో భాగంగా వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు.
Mangalagiri News : దేశ వైద్యవిధానం పూర్తిగా మారుతోందని, పలు మార్పులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్ లో శనివారం జాతీయ ఆరోగ్య మిషన్, ఆయుష్మాన్ భవ అధికారులతో కేంద్రమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని సంయుక్తంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ ప్రాచీన భారతీయ వైద్యానికి ఎంతో విలువ ఉందని తెలిపారు. ఆ స్థాయిలో ఇప్పుడు మళ్లీ భారతీయ వైద్య విధానం మారుతోందని చెప్పారు. మెడికల్ టూరిజంగా వైద్య రంగాన్ని దేశంలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కోవిడ్ సమయంలో ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయేలా దేశంలో ప్రజలకు వైద్య విభాగం సేవలు అందించిందని చెప్పారు. వేల కోట్ల రూపాయలను అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వైద్య రంగం కోసం ఖర్చు చేస్తోందని తెలిపారు. ఏపీకి అన్ని విధాలా తమ సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ఎన్.హెచ్.ఎం కింద కోరినంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆ నిధులను సక్రమంగా, నిర్ణీత సమయంలోగా ఖర్చు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు.
ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ
ఏపీ వైద్య రంగం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా వైద్య రంగంలో సంచలనాలకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తెరతీశారని తెలిపారు. ఆరోగ్యశ్రీ, 108, 104 వాహనాలు ఇలా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి వైద్యాన్ని పేదలకు చేరువ చేసిన వ్యక్తిగా రాజశేఖరరెడ్డి నిలిచారని చెప్పారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని వైద్య విధానాన్ని సమూలంగా మార్చేశారని తెలిపారు. వైఎస్సార్ కంటే కూడా గొప్పగా పేదలకు వైద్యాన్ని అందించడంలో జగనన్న విజయం సాధించారని చెప్పారు. రాజశేఖరరెడ్డి దేశంలోనే తొలిసారిగా ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఆ తరువాత పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా అచ్చం ఇలానే ఆయుష్మాన్ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. ఆరోగ్యశ్రీ కిందే తమ ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో రూ.2500 కోట్ల వరకు ఖర్చు చేసిందని చెప్పారు. ఇందులో రూ.200 కోట్ల వరకు ఆయుష్మాన్ భారత్ కింద కేంద్రం ఇచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్, ఆయుష్మాన్ భారత్ తదితర పథకాల గురించి అధికారులు మంత్రులకు వివరంగా చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలను చర్చించారు. మంత్రులు అడిగిన పలు సందేహాలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను తనవిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం