Mandous Cyclone Effect: మాండూస్ తుపాను ఎఫెక్ట్ - ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రవైపు దూసుకొస్తోంది.
మాండూస్ తుఫాను నేపథ్యంలో నేటి మధ్యాహ్నం నుంచి పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని స్కూళ్లు, కాలేజీలు ఈ నిబంధన పాటించాలని ఆదేశించారు. తుపాను వల్ల కురిసే వర్షాల నుంచి రక్షణ పొందాలని సూచించారు.
స్కూళ్లలో మధ్యాహ్న భోజనం పూర్తయిన తర్వాత నుంచి అన్ని పాఠశాలలు, కాలేజీలకు అనంతపురం జిల్లా కలెక్టర్ కే వెంకట్ రమణారెడ్డి సెలవు ప్రకటించారు. అన్ని స్కూళ్లు, కాలేజీలు తప్పకుండా ఈ ఆదేశాలు పాటించాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తుపాను ప్రస్తుత పరిస్థితి ఇదీ
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రవైపు దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతం మీదుగా "మాండోస్" గా ఉచ్ఛరించిన తీవ్ర తుపాను దాదాపు 12 కి.మీ వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా వెళ్లి నైరుతి మీదుగా పయనిస్తోంది. ట్రింకోమలీ (శ్రీలంక)కి ఉత్తర-ఈశాన్యంగా 240 కి.మీ., జాఫ్నాకు 270 కి.మీ తూర్పు-ఈశాన్య (శ్రీలంక), కారైకాల్‌కు తూర్పు-ఆగ్నేయంగా 270 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంలో 350 కి.మీ. వద్ద కేంద్రీకృతమై ఉంది.
మాండోస్ ఈ రోజు తీవ్ర తుపానుగా మారనుంది. సాయంత్రానికి క్రమంగా బలహీనపడి తుపానుగా మారే అవకాశం ఉంది. పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం వద్ద తీరం దాటనుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలపై ప్రభావం చూపనుంది. ఈ రోజు అర్ధరాత్రి గరిష్టంగా 65-75 కిలోమీటర్ల వేగంతో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.
ఏపీ సీఎస్ సమీక్ష
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను పట్ల ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తాల జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్ జవహర్ రెడ్డి ఆయా జిల్లాల కలక్టర్లను ఆదేశించారు. తుపాను నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలపై తిరుపతి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల కలక్టర్లతో వీడియో సమావేశం ద్వారా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ డా.జవహర్ రెడ్డి మాట్లాడుతూ భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం మాండస్ తుపాను ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి నాటికి పుదుచ్చేరి, మహా బలిపురం, శ్రీహరికోటల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రభావంతో ఈ నెల 10వ తేదీ వరకూ రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కావున ఆయా జిల్లాల కలెక్టర్లు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రకాశం జిల్లాల్లో ఒకటి, నెల్లూరు జిల్లాలో 2, తిరుపతి జిల్లాలో 1, చిత్తూరు జిల్లాలో 1 మొత్తం 5 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించడం జరిగిందని సీఎస్ డా.జవహర్ రెడ్డి తెలిపారు. అలాగే ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఒకటి వంతున మొత్తం 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. వర్షాలు, భారీ వర్షాలతో ఎక్కడైనా రహదారులకు లేదా ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థకు ఇబ్బందులు తలెత్తితే సత్వర చర్యలు తీసుకునేలా సర్వసన్నద్ధమై ఉండాలని సీఎస్ డా. జవహర్ రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఆయా జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.