Bail For magunta : మాగుంట రాఘవకు 4 వారాల బెయిల్ - ఈ సారి వ్యతిరేకించని ఈడీ
మాగుంట రాఘవకు బెయిల్ మంజూరైంది. ఈ సారి కోర్టులో ఈడీ బెయిల్ ను వ్యతిరేకించలేదు.
Bail For magunta : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవ్ కు ఢిల్లీ హైకోర్టు నాలుగు వారాల బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలపై మాగుంటకు నాలుగు వారాల పాటు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రాఘవకు బెయిల్ ఇవ్వడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వ్యతిరేకించలేదు. గతంలో ఢిల్లీ హైకోర్టు రాఘవకు బెయిల్ ఇవ్వగా దాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సారి మాత్రం ఈడీ వ్యతిరేకించలేదు. విచారణకు ఎప్పుడు పిలిచినా ఈడీ ముందు హాజరుకావాలని రాఘవను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ లేదా చెన్నై కార్యాలయాల్లో విచారణకు హాజరుకావచ్చని తెలిపింది. చెన్నై వదిలి వెళ్లవద్దని ఢిల్లీ హైకోర్టు షరతు విధించింది.
ఫిబ్రవరి పదో తేదీన మాగుంట రాఘవ అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ ఫిబ్రవరి పదో తేదీన మాగుంట రాఘవను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి జైల్లో ఉన్నారు. సౌత్ గ్రూప్ నుంచి అరబిందో శరత్ చంద్రారెడ్డిని కూడా గతంలో అరెస్ట్ చేశారు. చాలా కాలం జైల్లో ఉన్న తర్వాత భార్య అనారోగ్యం కారణంగా బెయిల్ తెచ్చుకున్నారు. తర్వాత అప్రూవర్ అయ్యారు. మాగుంట కుటుంబం దశాబ్దాలుగా డిస్టిలరీల వ్యాపారంలో ఉన్నారు. అయితే వారిపై ఎప్పుడూ తీవ్రమైన ఆరోపణలు రాలేదు. కానీ ఈ సారి మాత్రం మాగుంట రాఘవరెడ్డి జైలుకెళ్లాల్సి వచ్చింది. సౌత్ గ్రూపులో కేసీఆర్ కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్ మాగుంట, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి లంచాలిచ్చి లిక్కర్ బిజినెస్ సొంతం చేసుకున్నారని ఈడీ చెబుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో జైళ్లలోనే మగ్గుతున్న పలువురు నిందితులు
సమీర్ మహేంద్రు, అరుణ్‌పిళ్లైకి, శరత్‌చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయని.. మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడైన రాఘవ్ మాగుంటకు చెందిన జైనాబ్ ట్రైడింగ్, ఖావో గలీకి ఈఎండీ కింద రూ.15 కోట్లు చెల్లించారని ఈడీ చార్జిషీట్లలో పేర్కొంది. మాగుంట ఆగ్రోఫామ్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట రాఘవ్‌కు కూడా రెండు రిటైల్ జోన్లు ఉన్నాయిని ఈడీ చార్జిషీట్‌లో ప్రకటించింది. అయితే అందరూ అరెస్టయ్యారు కానీ కవిత మాత్రం బయటే ఉన్నారు. మాగుంట రాఘవరెడ్డిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించి ఎంపీగా చూడాలనుకున్నారు మాగుంట శ్రీనివాసులరెడ్డి. ఆయన మాత్రం…. రాజకీయ జీవితం ఆరంభం కాకుండానే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కుని అరెస్టయ్యారు. ఐదు నెలల పాటు జైల్లో గడపాల్సి వచ్చింది.
ఇటీవల డిల్లీ లిక్కర్ స్కాంపై స్లో అయిన దర్యాప్తు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్ ను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం సిసోడియాను అరెస్ట్ చేశారు. లఆయనకు బెయిల్ కూడా లభించడం లేదు. ఇంకా అనేక మంది జైళ్లలోనే ఉన్నారు. బెయిల్ పొందుతున్న వారు తక్కువ.