TDP JOinings : టీడీపీలోకి జోరుగా చేరికలు - పసుపు కండువా కప్పుకున్న మాగుంట కుటుంబం
Magunta : మాగుంట కుటుంబం టీడీపీలో చేరింది. ఒంగోలు నుంచి మాగుంట రాఘవ పోటీ చేసే అవకాశం ఉంది.
MP Magunta Srinivasulu Reddy: ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కుమారుడు మాగుంట రాఘవరెడ్డి కూడా పార్టీలో చేరారు. ఒంగోలు పార్లమెంటు సభ్యుడిగా మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని ఇప్పటికే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. తాను మాత్రం రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఆయన ఇటీవల ప్రకటించారు. వీరితో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, అద్దంకి వైసీపీ నేతలు బాచిన చెంచు గరటయ్య, కృష్ణచైతన్యలు కూడా టీడీపీలో చేరారు. వీరందరినీ చంద్రబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
వైసీపీలో ఎంపీ మాగుంటకు టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నాలు చేశారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. అది సాధ్యం కాకపోవడంతో.. క్రమంగా వైసీపీకి దూరం అయిన మాగుంట.. ఆ తర్వాత టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లారు. ఒంగోలులో బలమైన అభ్యర్థి కోసం చూస్తున్న టీడీపీకి.. మాగుంట కుటుంబం నుంచి వ్యక్తి అయితే సరిపోతారన్న కారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని మిగిలిని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్ధుల ఎంపిక విషయంలో మాగుంట సూచనలను టిడిపి అధిష్టానం పరిగణలోకి తీసుకునే అవకాశాలుఉన్నాయి. టిడిపిలో చేరిన వెంటనే పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన టిడిపి అభ్యర్దులతో మాగుంట సమావేశం కానున్నారు
2014 ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ ఎంపిగా ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసిపి టికెట్‌పై పోటీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు… దీంతో విధిలేని పరిస్థితుల్లో టిడిపిలో చేరి బిజెపి-టిడిపి-జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేసి కేవలం 15 వేల ఓట్ల తేడాతో మాగుంట ఓడిపోయారు… అయితే 2014 ఎన్నికల్లో టిడిపి ఎపిలో అధికారంలోకి రావడంతో మాగుంటను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీకి దించడంతో ఆయన గెలుపొందారు. ఆ సమయంలో మాగుంటకు మంత్రి పదవి ఇస్తారని ఆశించారు. అయితే చంద్రబాబు మాగుంటకు మంత్రి పదవి ఇవ్వలేదు. అనంతరం 2019 ఎన్నికల్లో మాగుంట తిరిగి వైసిపిలో చేరి ఒంగోలు పార్లమెంట్ నుంచి వైసిపి టికెట్‌పై పోటీ చేసి 2.14 లక్షల భారీ మెజార్టీతో గెలుపొందారు.
తిరిగి 2024లో కూడా మాగుంట వైసిపి టికెట్‌పై పోటీ చేసేందుకు చివరివరకు పోరాడారు. అయితే ఆయనకు వైసిపి అధినేత, సియం వైయస్ జగన్ ఈసారి ఎంపి టికెట్ ఇచ్చేందుకు ససేమీరా ఒప్పుకోలేదు. మాగుంట కాంబినేషన్ అయితే ఒంగోలుతో పాటు మరో రెండు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసిపి అభ్యర్దులు గెలుపొందే అవకాశాలు ఉన్నాయని భావించిన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి మాగుంట కోసం చివరి వరకు పార్టీ అధిష్టానంతో పోరాడారు… అయితే బాలినేని ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఈసారి మాగుంట తనదారి తాను చూసుకున్నారు… ఫిబ్రవరి 28వ తేదిన మాగుంట పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మాగుంట రాగవ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కుని అప్రూవర్ గా మారారు.