Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Andhra Pradesh News | హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త కమిషన్ ఎక్కడికి తరలించడం లేదని.. రాజధాని అమరావతిలోనే కొనసాగిస్తామని ఏపీ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుకు తెలిపింది.
HRC In Amaravati | అమరావతి: లోకాయుక్త కమిషన్, హెచ్‌ఆర్‌సీ తరలింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త కమిషన్‌ను రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలోనే ఉంచుతామని, అందుకు వీలుగా చట్టసవరణ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు న్యాయవాది బుధవారం నాడు హైకోర్టుకు తెలిపారు. హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది. లోకాయుక్త కమిషన్, హెచ్‌ఆర్‌సీ తరలింపుపై మద్దిపాటి శైలజ, ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. నేడు విచారణకు రాగా, పిటిషనర్ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. అయితే వీటిని ఎక్కడికి తరలించడం లేదని, అమరావతిలోనే ఉంచుతామని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
సోషల్ మీడియా పోస్టుల కేసులపై హైకోర్టులో విచారణ
ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్న అసభ్యకర, దుష్ప్రచారం చేసేలా ఉన్న సోషల్ మీడియా పోస్టుల కేసులపై వైసీపీ, కూటమి నేతల మధ్య ఆరోపణలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అవినీతి, అసమర్థతను ప్రశ్నిస్తున్నందున తమ పార్టీకి చెందిన సోషల్ యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేస్తున్నారంటూ వైసీపీ విమర్సలు చేస్తోంది. ఈ వివాదంలో మూకుమ్మడిగా అరెస్టులు చేస్తున్నారని విజయబాబు దాఖలు చేసిన పిటిషన్ పిల్ విచారణకు రాగా.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ తరహా వ్యవహారాల్లో అభ్యంతరాలు ఉంటే కోర్టులో పిటిషన్ దాఖలు వేయాలని సూచించింది.
ఆదేశాలు ఇవ్వలేమని తేల్చిన హైకోర్టు
గత ప్రభుత్వంలో ఒక దశలో న్యాయమూర్తులను కూడా అవమానపర్చేలా పోస్టులు పెట్టారని కోర్టు విచారణలో భాగంగా కామెంట్స్ చేసింది. ధర్మాసనం, జడ్జీలు, కోర్టులను వదలని వారు రాజకీయ నేతలు, మహిళల్ని ఇంకెలాంటి స్థాయిలో అసభ్యకర పోస్టులు చేసి ఉంటారో అర్థం చేసుకోవాలన్నారు. కనుక సోషల్ మీడియాలో చేసే అసభ్యకరమైన పోస్టులపై ఫిర్యాదులు వస్తే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. పోలీసులు నమోదు చేసిన కేసులపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు తమకు దక్కాల్సిన న్యాయంపై కోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ కు సూచించింది. అసభ్య పోస్టులు పెట్టి చెలరేగిన వారిపై పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడాన్ని తాము ఎలా నిలువరిస్తామని ధర్మాసనం కామెంట్ చేసింది.
నటుడు పోసాని కృష్ణమురళీ, నటి శ్రీరెడ్డి లాంటి సినీ రంగానికి చెందిన వారితో పాటు రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో చేసిన అసభ్యకర పోస్టులు, బూతులపై వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు విషయం తీవ్రతను ఆధారంగా నోటీసులు ఇచ్చి అరెెస్టులు చేస్తున్నారు. దాంతో హామీలు అమలు చేయాలని నిలదీస్తే, చంద్రబాబు ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకు వైసీపీ శ్రేణుల్ని సోషల్ మీడియా పోస్టులు అనే సాకుతో అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వనందుకు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు.