Viveka Murder Case: పులివెందులలో సీబీఐ టీమ్ - వివేకా, అవినాష్ రెడ్డిల ఇళ్లను పరిశీలించిన అధికారులు
CBI team in Pulivendula: సీబీఐ బృందం మరోసారి పులివెందులకు వెళ్లింది. సీబీఐ అధికారులు పులివెందులలో వివేకా ఇంటి పరిసరాలను పరిశీలించారు. వివేకా హత్య జరిగిన ఇంట్లో బాత్రూమ్, బెడ్ రూమ్ ను పరిశీలించారు.
YS Viveka Murder Case: సీబీఐ అధికారులు మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఇదివరకే వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డి సైతం పలుమార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఏప్రిల్ 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా సీబీఐ బృందం మరోసారి పులివెందులకు వెళ్లింది. సీబీఐ సిట్ టీమ్ అధికారులు పులివెందులలో మాజీ ఎంపీ వివేకానందరెడ్డి ఇంటి పరిసరాలను పరిశీలించారు. వివేకా హత్య జరిగిన ఆయన ఇంట్లో బాత్రూమ్, బెడ్ రూమ్ ను పరిశీలించారు. వివేకా ఇంటిని పరిశీలించిన అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి సీబీఐ సిట్ టీమ్ వెళ్లింది.
అవినాష్ రెడ్డి ఇంటి పరిసరాలనూ సీబీఐ అధికారులు పరిశీలించారు. ఎంపీ అవినాష్ పీఏ రమణారెడ్డిని కొన్ని విషయాలపై సీబీఐ అధికారులు ఆరా తీశారు. వివేకా హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి తన ఇంటి నుంచి వివేకా ఇంటికి ఎంత సమయంలో చేరుకోవచ్చు అనే కోణంలో ఇదివరకే టెక్నికల్ ఆధారాలు సేకరించారు. నేడు మరోసారి సీబీఐ సిట్ టీమ్ వివేకా, అవినాష్ రెడ్డి ఇళ్లు, ఇంటి పరిసరాలను పరిశీలించింది. వివేకా ఇంట్లో పనిచేసే వారిని అధికారులు పలు విషయాలు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వివేకా చనిపోయాక, మృతదేహాన్ని ఫొటోలు, వీడియోలు తీసి కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లానే మాజీ ఎంపీ కుటుంబసభ్యులకు పంపారు. మరోవైపు రేపు (సోమవారం) సుప్రీంకోర్టులో వివేకా కేసుపై విచారణ జరగనున్న క్రమంలో ఒకరోజు ముందు సీబీఐ సిట్ టీమ్ పులివెందులకు వచ్చి వివేకా, ఎంపీ అవినాష్ రెడ్డి ఇల్లు, ఇంటి పరిసరాలను పరిశీలించారు.
హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ఈ సందర్బంగా హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది చాలా దారుణమైన ఆర్డర్ అంటూ ఆక్షేపించింది. అన్ యాక్సెప్టబుల్ అంది. వాదనలు పూర్తైన తర్వాత హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇస్తున్నట్టు సుప్రీంకోర్టు చెప్పింది. దీనిపై స్పందించిన అవినాష్ రెడ్డి న్యాయవాది ఇప్పటికిప్పుడు స్టే ఇస్తే తన క్లయింట్‌ను సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందని అన్నారు. అయితే సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశాల్లో పేర్కొంది సుప్రీంకోర్టు. అనంతరం ప్రతివాదులకు నోటీసులు కూడా జారీ చేసింది.
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, రెండు రోజుల వాదనలు తర్వాత ధర్మాసనం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 25వ తేదీ వరకూ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చింది. 25వ తేదీన తుది తీర్పు ఇవ్వనున్నట్లు తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. ఈ తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సునీత గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. సీజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు సునీత పిటీషన్ సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూద్రా ప్రస్తావించారు. ఇవాళ విచారణకు స్వీకరిస్తామని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు.