పుస్తకాలు ఇవ్వండి- మెస్‌ఛార్జీలు పెంచండి- ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా
కర్నూలు జిల్లాలో ఎస్ఎఫ్ఐ చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసింది. సకాలంలో పాఠ్య పుస్తకాలు అందించాలని కోరింది.
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో ఎస్‌ఎఫ్‌ఐ చోలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్రంలోని 3, 4, 5వ తరగతుల విలీనాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంతోపాటు పాఠ్య పుస్తకాలను సకాలంలో అందించాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు నెలకు 2500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు విద్యా వతి దీవెనల పథకం అమలు చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ఉన్న బైజూస్ ఒప్పందాన్ని రద్దు చేయాలన్నారు.
బడులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా పుస్తకాలు లేవు
కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నేతలు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. 2022-2023 విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించలేదని అన్నారు. దీని వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అందక విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
మెస్ ఛార్జీలను పెంచాలని డిమాండ్..
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా 3,4,5 తరగతుల విలీనాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు నాయకులు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులను విలీనం చేయడం ద్వారా విద్యకు దూరమవుతున్నారని విద్యార్థి సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇటువంటి చర్యలను మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వసతి గృహాల విద్యార్థులకు ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. గతంలో ఉండే చార్జీల వల్ల హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు అనుకున్న స్థాయిలో అందుబాటులో లేక తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నారన్నారు. అందుకే మెస్ ఛార్జీలను పెంచి విద్యార్థులకు మెరుగైన వసతి గృహ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
జీవోల మార్పుల వల్ల గందరగోళ వాతావరణం...
గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల జీవోలను అమలు చేసి కొన్ని రోజులు గడవకు ముందే దాన్ని మార్చి 128వ జీవోను ప్రవేశ పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. ఇలాంటి జీవోల ద్వారా ఉపాధ్యాయులకు గందరగోళ వాతావరణం నెలకొందని విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం బైజుస్ అనే సంస్థ ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు. ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా పాఠ్య పుస్తకాలను అందించాలని వారు డిమాండ్ చేశారు.