Viral Video: మంత్రి ఉష శ్రీ చరణ్‌ను ఆశీర్వదించిన వానరం- వైరల్‌గా మారిన వీడియో
కొత్తగా నియమితులైన మంత్రి ఉష శ్రీ చరణ్‌కు వింతైన అనుభవం ఎదురైంది. పూజలు చేస్తున్న టైంలో వానరం వచ్చి ఒడిలో కూర్చొంది.
స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఉష శ్రీ చరణ్. తనకు మద్దతుగా నిలిచిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇష్ట దైవాలను కూడా సందర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
సొంత నియోజకవర్గ పర్యటనలో భాగంగా కసాపురం ఆంజనేయ స్వామిని సందర్శించారు మంత్రి ఉష శ్రీ చరణ్. ఆమెకు ఘనస్వాగతం పలికిన ఆలయ సిబ్బంది... ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు తీర్థ ప్రసాదాలు అందించారు.
మంత్రి ఉష శ్రీ చరణ్‌కి తీర్థప్రసాదాలు అందజేస్తున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చిన వానరం అందర్నీ ఆశ్చర్యపరిచింది. నేరుగా వచ్చి ఉష శ్రీచరణ్ ఒడిలో కూర్చొంది.
దీన్ని చూసిన మంత్రి గానీ ఆమె అనుచరులుగానీ ఎలాంటి ఆందోళనకు గురి కాలేదు. వచ్చిన వానరాన్ని ఏమీ అనలేదు కూడా. కాసేపు మంత్రి ఒడిలో కూర్చొంది. ఆ టైంలోనే గుడిలో పూజారులు ఉష శ్రీ చరణ్ ఆశీర్వదించారు.
ప్రత్యేక పూజలు, ఆశీర్వాదాలు పూర్తైన తర్వాత మంత్రి ఉష శ్రీ చరణ్‌కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అప్పటికే అక్కడ ఉన్న కోతి... వాటిని పరీక్షగా చూసింది. అందులో ప్రసాదం పెట్టిన బాక్స్‌ను కూడా చూసింది. దాన్ని ఎత్తుకుపోతుందేమో అని అంతా అనుకున్నారు కానీ వానరం ఆ పని చేయలేదు.
అక్కడ ఉన్న వ్యక్తి ఒకరు.. ఆ బాక్స్‌లోని ప్రసాదాన్ని తీసి వానరానికి ఇచ్చారు. కానీ దాన్ని తీసుకోలేదా వానరం. ఈ తతంగం జరుగుతుండగానే వానరం అక్కడ నుంచి లేచి సైలెంట్‌గా వెళ్లిపోయింది. మంత్రి కూడా తన పర్యటన ముగించుకొని వెళ్లిపోయారు.
మంత్రి అయిన తర్వాత నియోజకవర్గానికి వస్తున్న క్రమంలో ఉష శ్రీ చరణ్ చేపట్టిన ర్యాలీ వివాదాస్పదమైన విషయం తెలిసింది. ఈ ర్యాలీలో పోలీసుల అత్యుత్సాహంతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని ఆమె ఆరోగ్యం బాగాలేక చనిపోయిందని... యాత్రతో సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు.
ఉష శ్రీ చరణ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చాలా వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి. జిల్లాలోనే వివాదాల నేతగా ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి. ఈ మధ్య సొంత పార్టీ కౌన్సిలర్ ఆరోపణలు చేయడం చాలా దుమారం రేగింది. తన వద్ద డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించమంటే చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. తర్వాత ఏమైందో కానీ వాళ్లెవరూ మీడియా ముందుకు వచ్చింది లేదు. అందుకే మంత్రిగా ఆమె చేస్తున్న చర్యలపై ప్రత్యర్థులు చాలా ఫోకస్డ్‌గా చూస్తున్నారు.