Kurnool News: నేడు కప్పట్రాళ్ళకు కర్నూలు జిల్లా యంత్రాంగం, శాస్త్రవేత్తలు- యురేనియం తవ్వకాలపై ప్రజలతో చర్చలు
Uranium Project In Kappatralla: కప్పట్రాళ్ళకు శాస్త్రవేత్తలు, ఫారెస్ట్, రెవిన్యూ, పోలీస్ అధికారులు వెళ్లనున్నారు. యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్న గ్రామాల ప్రజలతో చర్చలు జరపనున్నారు.
Kappatralla News: రిజర్వ్ ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాలు వద్దంటూ వ్యతిరేకిస్తున్న గ్రామాల ప్రజలతో శాస్త్రవేత్తలు, ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ అధికారులు ఈ రోజు(నవంబర్ 4) కప్పట్రాళ్లలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఆయా గ్రామాల ప్రజలతో చర్చించడానికి తాము రెడీ అంటూ పిలుపునిచ్చారు. శనివారం నుంచి కప్పట్రాళ్ల సహా 12 గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కప్పట్రాళ్ల ప్రజలైతే శనివారం నాడు తమను తాము స్వీయ నిర్బంధం చేసుకుని ఇతరులు ఎవరూ తమ గ్రామంలోకి రాకుండా రోడ్డుకు అడ్డంగా ముళ్ళకంచెలు వేశారు. వారికి మద్దతుగా ఎవరూ గ్రామంలోకి వెళ్లకుండా పోలీసులు చాలామందిని హౌస్ అరెస్టులు చేయడాన్ని స్థానిక రాజకీయ పార్టీలు నేతలు తప్పుపట్టారు. తమ గ్రామాల్లో యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బ తినడంతో పాటు తమ ఆరోగ్యలు పాడవుతాయని ఆ 12 గ్రామాల ప్రజల వాదన. దీనికి స్థానిక ఎమ్మెల్యే విరూపాక్షి (YSRCP )సైతం మద్దతు ఇచ్చారు. లోకల్ టిడిపి నాయకులు సైతం ఆయా గ్రామాల ప్రజల పోరాటంలో పాల్గొంటున్నారు.
అసలు వివాదం ఏంటి?
ఒకప్పుడు ఫ్యాక్షన్‌తో బాధపడిన కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్ల వంటి గ్రామాలు హంద్రీనీవా ప్రాజెక్టు పుణ్యమా అంటూ వ్యవసాయం బాట పట్టాయి. అయితే ఆయా గ్రామాల సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో యురేనియం మూలకం వెలికి తీత కోసం 468. 25 హెక్టార్లలో తవ్వకాలకు కేంద్రం అనుమతించింది. దీనివల్ల అడవితోపాటు, పర్యావరణం, నీరు దెబ్బతింటాయని తమ గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలు అవుతారని కప్పట్రాళ్ల సహా 12 గ్రామాల ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తున్నారు.
కప్పట్రాళ్ల, బేతపల్లి, పి.కోటకొండ, చెల్లెలచెలిమల, గుండ్లకొండ, నెల్లిబండ, నేలతలమరి, జిల్లేడు బుడకల, మాదాపురం, ఈదులదేవరబండ, బంటుపల్లి,దుప్పనగుర్తి గ్రామాల ప్రజలు, స్థానిక రాజకీయ నేతలు పార్టీలకతీతంగా ఆందోళన చేస్తున్నారు. ఈ 12 గ్రామాలే కాకుండా మొత్తం పాతిక ఊళ్లపై యురేనియం తవ్వకాల దుష్ప్రభవాలు పడతాయన్నది పర్యావరణవేత్తల ఆరోపణ. దీనిపై శుక్రవారం ఆయా గ్రామాల ప్రజలు సమావేశం నిర్వహించుకుని శనివారం తీవ్ర ఆందోళనకు దిగారు. కప్పట్రాళ్ల మొత్తం స్వీయ నిర్బంధంలోకి వెళ్ళిపోగా కర్నూలు - బళ్ళారి రహదారి మొత్తం ఐదు కిలోమీటర్ల పాటు స్తంభించిపోయింది.
ఈరోజు ( నవంబర్ 4) న కలెక్టర్ స్వయంగా వచ్చి ఈ విషయంపై గ్రామస్తులతో చర్చలు జరుపుతానని హామీ ఇవ్వడంతో శనివారం తాత్కాలికంగా ఆందోళన విరమించారు ఆ 12 గ్రామాల ప్రజలు. చెప్పినదాని ప్రకారమే జిల్లా కలెక్టర్, శాస్త్రవేత్తలు, ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ అధికారులు కప్పట్రాళ్లలో పర్యటించనున్నారు. గ్రామస్తులతో ఈ విషయమై చర్చలు జరుపుతామని కాబట్టి ఆయా గ్రామాల ప్రజలు తమ వద్దకు వచ్చి తమ సందేహాలు వెళ్ళబుచ్చవచ్చని తెలిపారు.
యురేనియం తవ్వకాల వ్యతిరేక ఉద్యమానికి వైసిపి మద్దతు
యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్న కర్నూలు జిల్లా గ్రామాలు ప్రజలకు ప్రతిపక్ష వైసిపి ఎమ్మెల్యే విరూపాక్షి మద్దతు ప్రకటించారు. యురేనియం తవ్వకాలను వెంటనే ఆపకపోతే ప్రజలతో కలిసి ఉద్యమంలో పాల్గొంటామని హెచ్చరించారు. యురేనియం తవ్వకాల వ్యతిరేక ఉద్యమానికి తమ పార్టీ మద్దతు ఉందని స్పష్టం చేశారు. మరి ఈ ఉద్యమం ఏ మలుపు తిరుగుతుందో ఈరోజు అధికారుల చర్చలతో తేలే అవకాశం ఉంది.