జేసీ దివాకర్ రెడ్డి పొలిటికల్ యాక్షన్ షురూ- ఫుల్ జోష్‌లో అభిమానులు
JC Diwakar Reddy: ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాడిపత్రి, నియోజక వర్గ వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.
JC Diwakar Reddy: రాజకీయాల్లోకి పున: ప్రవేశిస్తున్నట్లు జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించడంతో ఆయన అనుచరగణంలో నూతన ఉత్సాహం నెలకొంది. గత సార్వత్రిక ఎన్నికల ముందు రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్లు జేసీ దివాకర్ ప్రకటించారు. అప్పటి నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అప్పుడప్పుడూ రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ ఉండేవారు. తన బాధ్యతలను తన వారసులైన పవన్ కు అప్పచెప్పారు. అయితే జేసీ కుటుంబానికి సంబంధించిన రాజకీయాలను జేసీ ప్రభాకర్ రెడ్డి చూస్తూ వచ్చారు. ఇటీవల రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్న దృష్ట్య తాను రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం కచ్చితం అని భావించారో ఏమో తెలియదు గానీ గత వారం రోజుల క్రితం తిరిగి రాజకీయాలలోకి వస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన అనుచర వర్గంలో ఉత్సాహం నెలకొంది.
నియోజక వర్గ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు..
కేవలం ప్రకటనతోనే ఆగకుండా జేసీ దివాకర్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తన అనుచరుల ఇళ్లకు వెళ్తూ పలకరించి ఉత్సాహ పరుస్తున్నారు. దీంతో పెద్దాయన మళ్లీ రాజకీయాల్లోకి వచ్చాడంటూ తాడపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా జేసీ కుటుంబ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చి హాట్ కామెంట్స్ చేయలేదు కానీ ఇకపై జిల్లా రాజకీయాలలో తాజా పరిణామాలు చోటు చేసుకుంటాయని అంటూ రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ముక్కుసూటిగా మాట్లాడుతూ ముందుకెళ్తున్న దివాకర్ రెడ్డి..
అయితే రాష్ట్రవ్యాప్తంగా జేసీ దివాకర్ రెడ్డి అంటే తెలియని వారుండరు. రాష్ట్ర విభజన ముందు వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈయన విభజన తర్వాత టీడీపీలోకి వచ్చారు. ఆయనతో పాటే ఆయన సోదురుడు జేసీ ప్రభాకర్, కుమారుడు పవన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఆయన ఏ పార్టీలో ఉన్న ప్రత్యేకంగా ఉంటూ... రాష్ట్ర రాజకీయాలపై ఎప్పుడూ మాట్లాడుతూ ఉండే వారు. అందరిలాగా జాగ్రత్త పడుతూ.. మనసులోనే కొన్ని దాచేస్తూ ఉండే వ్యక్తి కాదు ఈయన. ఏం జరిగినా ఫర్వాలేదు అనుకొని కుండబద్ధలు కొట్టినట్లు విషయాన్ని చెప్తారు. మనుసులో ఎలాంటి విషయాన్ని కూడా దాచుకోరని చాలా మంది అభిప్రాయం. దీని వల్లే ఆయన చాలా సార్లు సమస్యలు ఇరుక్కున్నారు కూడా. అయినప్పటికీ ఆయన ఎక్కడా బెదరలేదు. వెనకడుగు వేయలేదు.
ఆయన సోదరుడు మాత్రం యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉంటూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ మధ్య తాడిపత్రిలో జరిగిన సంఘటనపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. దేశం అంతా స్వాతంత్ర్య దినోత్సవాలు చేసుకుటున్న సమయంలో తాడిపత్రిలో ఇద్దరు మహిళలపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన తాడిపత్రిలో సంచలనం సృష్టించింది. పెట్రోల్ దాడిలో గాయపడ్డ మహిళలను జేసీ ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. ఇటువంటి ఘటనలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సి ఉందన్నారు.
తాడిపత్రిలో భయానక పరిస్థితులు ఉన్నాయన్న జేసీ
గాయపడ్డ మహిళలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానని.. పోలీసులు నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తాడిపత్రిలో ఇంత భయానకంగా వాతావరణ ఉంటే జిల్లా ఎస్పీ ఏం చేస్తున్నారని.. ఇప్పటికైనా నిందితులను కఠినంగా శిక్షించాల్సి ఉందన్నారు. పోలీసుల ప్రతాపం మాపై కాదు... బాధితులకు అండగా ఉండండని సలహా ఇచ్చారు.