Nandyala News: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు.. ఐదుగురు మృత్యువాత
Nandyal Accident News: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో హైదరాబాదుకు చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
Road Accident In Nandyala : నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగుంట్ల వద్ద ఆగి ఉన్న లారీని ఒక కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. వీరంతా తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం నల్లగుంట్ల దగ్గర హైవేపై ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తున్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి నిద్రమత్తు కారణమై ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
నూతన వధూవరులతో సహ ప్రయాణిస్తున్న వారంతా మృతి
బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందారు. సికింద్రాబాద్లోని వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన మంత్రి రవీందర్ తన కుటుంబంతో కలిసి కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కారులో రవీందర్ తోపాటు అతడి భార్య లక్ష్మీ, కుమారుడు బాల కిరణ్, కోడలు కావ్య, మరో కుమారుడు ఉదయ్ కిరణ్ ఉన్నారు. వీరిలోనే ఒకరు కార్ డ్రైవ్ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తెల్లవారుజాము కావడంతో నిద్ర మత్తులోకి జారుకోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గత నెల 29న బాలకిరణకు కావ్య తో గుంటూరు జిల్లా తెనాలిలో వివాహం జరిపించారు. ఈ నెల మూడో తేదీన శామీర్పేటలో ఘనంగా రిసెప్షన్ కూడా పూర్తి చేశారు. నాలుగో తేదీన నూతన దంపతులతో కలిసి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వెళ్లారు. తిరిగి ప్రయాణం అవుతున్న క్రమంలోనే ఈ ప్రమాదం సంభవించింది. కారులో ప్రయాణిస్తున్న వారంతా ప్రమాదంలో మృతి చెందడంతో వీరు వివరాలను తెలుసుకోవడానికి పోలీసులకు కొంత సమయం పట్టింది. వారి వద్ద ఉన్న ఆధార్ కార్డులు, ఐడి కార్డు వివరాలను బట్టి వీరిని పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. నిండు నూరేళ్లు కలిసి మెలగాల్సిన నూతన జంట.. పెళ్లి జరిగిన పది రోజులు కూడా కలిసి జీవించలేకపోయారంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.