Pulivendula ZPTC ByElection: పులివెందులలో పలుచోట్ల ఉద్రిక్తత.. 100 కోట్లు పెట్టారని బీటెక్ రవి ఆరోపణలు, పత్తి యాపారం ఆపాలన్న వైసీపీ
పులివెందులలో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పలుచోట్ల ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు వైసీపీ, కూటమి శ్రేణులకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ZPTC ByElection in Pulivendula and Vontimitta | పులివెందుల: ఊహించినట్లుగానే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పలుచోట్ల ఉద్రిక్తత చోటుచేసుకుంది. పలుచోట్ల పోలింగ్ బూత్‌ల వద్ద వైసీపీ, టీడీపీ కార్యకర్తలు, శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. కానేపల్లెలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడికి దిగింది. వైసీపీ కార్యకర్తల దాడిలో కారు ధ్వంసం అయినట్లు సమాచారం. పులివెందుల మండలం ఎర్రబలె గ్రామంలోనూ ఇరు పార్టీల కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. చింతరాజు పల్లెలో ఎలక్షన్ బూత్‌లో వైసీపీ, టీడీపీ ఏజెంట్లు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఉప ఎన్నికల సందర్భంగా పులివెందులలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి కడపకు తరలించారు.
రూ.100 కోట్లు ఖర్చు, ఓటర్లను ప్రలోభాలు..
పులివెందులలో జడ్పిటిసి సీటు కోసం వైసిపి నేతలు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే విధంగా రాత్రి 12 గంటల వరకు చీరలు, ముక్కుపుడకలు పంచుతూనే ఉన్నారని ఆరోపించారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పోలింగ్ సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పోలింగ్ సిబ్బంది సహకరించాలని, లేకపోతే తరువాత అధికారంలోకి వచ్చాక మీ మీద చర్యలు తీసుకుంటాం అంటూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని బీటెక్ రవి పేర్కొన్నారు.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం దిగజారిన జగన్ రెడ్డి. 100 కోట్లు ఖర్చు చేస్తున్న వైసీపీ. ముక్కుపుడకలు, చీరలు అంటూ ఓటర్లకు వెదజల్లడం సిగ్గుచేటు. ఇదే కాకుండా పోలింగ్ సిబ్బంది, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, పోలీస్ సిబ్బందిని బెదిరిస్తున్న జగన్ మామ రవీంద్రనాథ్ రెడ్డిపై తక్షణమే 1/2 pic.twitter.com/HjNAAArAB3
— B.Tech Ravi.Ex.MLC (@BTechRaviOff) August 11, 2025
దాదాపు 30 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలంటూ పులివెందుల నియోజకవర్గంలో 11 నామినేషన్లు వేశారు. కానీ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు సజావుగా జరగకుండా వైసీపీ నేతలు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై స్పందించి ఎన్నికల అధికారులు తక్షం వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని’ బీటెక్ రవి కోరారు.
ఎక్కడుంది సార్ ప్రజాస్వామ్యం?
— YSR Congress Party (@YSRCParty) August 12, 2025
- పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డి పెద్దమ్మ pic.twitter.com/eROEMmzxiN
పులివెందుల్లో పత్తి యాపారం..
ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు అందుకు విరుద్ధంగా జరుగుతున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పులివెందులలో జడ్పీటీసీ ఎన్నికలు జరగడం లేదు. ప్రవీణ్ పత్తి యాపారం జరుగుతోందంటూ సెటైర్లు వేశారు. పులివెందులలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది. ఇలా ఎన్నికలు నిర్వహించడం అవసరమా అని వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డి పెద్దమ్మ ప్రశ్నించారు. ఈ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే పిల్లలు కాదు వాళ్లు కూడా గెలుస్తారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

మీ కాళ్లు పట్టుకుంటాం.. మమ్మల్ని ఓటు వేసేందుకు పంపించండి సార్ అని కొందరు ఓటర్లు పోలీసులను అడుక్కుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కనంపల్లి సర్పంచ్ రామామంజనేయులు ఇంటి వద్ద మంచంపై గన్ను పెట్టి పోలీసులు బెదిరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా, సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. రెండు చోట్ల బరిలో 11 మంది చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నారు. పులివెందులలో 15, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ నిర్వహిస్తున్నారు.






















