(Source: ECI | ABP NEWS)
CM Chandrababu: వివేకానందరెడ్డి హత్యపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, మహానాడు వేదికగా పార్టీ శ్రేణులకు జాగ్రత్తలు
వివేకా హత్య విషయంలో నన్నే కొందరు నమ్మించే ప్రయత్నం చేశారు, మీరంతా చాలా జాగ్రత్తగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు మహానాడు వేదికగా పార్టీ శ్రేణులకు సూచించారు.

కడప: నా తెలుగు కుటుంబం ఆరు శాసనాలు ఏపీలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) పేర్కొన్నారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు రెండో రోజు పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే కడప గడ్డమీద మీకు చెబుతున్నా. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య (Viveka Murder Case)తో నన్నే మోసం చేశారు. తెల్లవారుజామున లేవగానే గుండెపోటుతో వివేకానందరెడ్డి చనిపోయారని వారి టీవీ, మీడియాలో వచ్చింది. ఎన్నికల పనులతో బిజీగా ఉన్న నేను కూడా అందరిలాగే అది నిజమని నమ్మాను. కానీ సాయంత్రానికి అది మలుపుల మీద మలుపులు తిరిగి గొడ్డలి దాడి వరకు వచ్చింది. గొడ్డలతో దాడి చేసి మెదడు బయటకు వచ్చేలా హత్య చేశారు. గుండెపోటుతో రక్తం వచ్చి గోడలు కూడా తడిసిపోయాయని చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నారాసుర రక్త చరిత్ర అని చేతిలో కత్తి పెట్టి నా మీద నింద వేశారు. దీన్ని మీరంతా అర్థం చేసుకుని కరుడుగట్టిన నేరస్తులతో మనం రాజకీయాలు చేస్తున్నాం. మీరంతా అప్రమత్తంగా ఉండాలని’ టీడీపీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు.
కార్యకర్తే నా హైకమాండ్..
‘తెలుగు జాతిని 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్ చేయాలన్న సంకల్పంతో ఏపీ ప్రభుత్వం ముందుకుసాగుతుందన్నారు. మళ్లీ జన్మ ఉంటే తెలుగు జాతి కోసం తెలుగు గడ్డ మీదే పుడతాను. కార్యకర్తే నా అధినేత. నా హైకమాండ్. ఇదే పార్టీ సిద్ధాంతం. పార్టీలో సాధారణ కార్యకర్తే సుప్రీంగా ఉంటారు. 45 రోజుల్లో కోటికి పైగా సభ్యత్వాలు నమోదు చేపించిన పార్టీ తెలుగుదేశం.
పార్టీలో యువరక్తం, కొత్త ప్రజా ప్రతినిధులు
తొలిసారి అసెంబ్లీకి 65 మందికి సీట్లు ఇచ్చాం. ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి సాహసం చేశాం. 61 మంది గెలిచారు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో నూతన నాయతక్వం ఏర్పడింది. ఆరు శాసనాలు ప్రవేశపెట్టిన నారా లోకేష్‌కు అభినందనలు. విదేశాల్లో చదువుకుని వచ్చిన లోకేష్.. తన నాలెడ్జ్, టెక్నాలజీ ఉపయోగించి నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. నా మిత్రుడు ఎర్రన్నాయుడు కుమారుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు అతిపిన్న వయసులో కేంద్ర మంత్రి అయ్యారు.
టీడీపీ నుంచి సామాన్యుడు ఎంపీ, ఎమ్మెల్యేగా..
సాధారణ కార్యకర్త కుమారుడు వెంకట్రాజు ఎమ్మెల్యే అయ్యారు. సాధారణ కార్యకర్త అప్పల్రాజు ఎంపీ అయ్యారు. మొన్నటివరకూ మీతో కూర్చున్న వారు ఈరోజు ప్రజాప్రతినిధులుగా విజయం సాధించి వేదిక మీదకు వచ్చారు. పార్టీ ఒకప్పుడు గ్రామ, మండల, జిల్లా శాఖలు ఉండేవి. ఎన్నికల్లో ప్రాధాన్యత కోసం క్లస్టర్, యూనిట్, బూత్ లాంటి వ్యవస్థలు తీసుకొచ్చి ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాం. 43 ఏళ్లు పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల కృషి ఫలితమే గత ఎన్నికల్లో విజయం. అందుకే కార్యకర్తే అధినేత. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అన్ని ప్రాంతాల్లో టీడీపీనే నెగ్గాలి. భారీ మెజార్టీకి అక్కడి నాయకత్వం కారణం.
నేరస్తులకు చంద్రబాబు హెచ్చరిక
సంతనూతలపాడు, పల్నాడు వీరయ్య చౌదరి హత్యలు జరిగితే అనుమానం వచ్చింది. ఇప్పుడు నేను ఎవరినీ నమ్మడం లేదు. ఎవరు చేశారనే కోణంలో ఆలోచించి పని చేస్తున్న. కొందరు మన వద్ద ఉండి వాళ్లకు కోవర్టుగా ఉండి, హత్యా రాజకీయాలు చేస్తున్నారు. ఇది టీడీపీ వారి పని అని ప్రజలకు చూపించి మన మీద బురద జల్లడం. ఎవరైనా మన కార్యకర్త ఇలాంటివి చూస్తే ఉపేక్షించను. నేరస్తులు ఖబడ్దార్ అని’ హెచ్చరించారు. కొన్ని వలస పక్షులు వస్తాయి, పోతాయి.. కానీ నిజమైన కార్యకర్త ఎప్పటికీ మన వెంటే ఉంటాడు. కోవర్టుల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలని సూచించారు.






















