AP Complaint On Telangana: శ్రీశైలంపై తెలంగాణను కట్టడి చేయండి- కేఆర్‌ఎంబీకి ఏపీ ఫిర్యాదు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య మరోసారి వివాదం రేగింది. మళ్లీ శ్రీశైలం రిజర్వాయర్ వేదికగా జగడం చెలరేగింది.
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు చేసింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు ఏపీ జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి ఫిర్యాదు చేశారు. అనధికారికంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని... నీటిని వినియోగించుకుంటున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని నియంత్రించాలని... అనధికారిక నీటి వినియోగాన్ని అరికట్టాలని అభ్యర్థించింది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు వాడుకుంటున్న నీటిని 2022-23 సంవత్సరం కేటాయింపుల్లో తగ్గించాలని వాదన తెరపైకి తీసుకొచ్చింది. గతంలో చేసుకున్న ఒప్పందాలకు ఇది విరుద్దంగా ఉందని ఆరోపించింది.
శ్రీశైలం జలాశయానికి భారీగా సుమారు 20 టీఎంసీల మేర వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 1.47 లక్షలు, సుంకేశుల ప్రాజెక్టు నుంచి 1.31 లక్షల క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం నీటి మట్టం 840.1 అడుగులు. శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి కారణంగా 31.784 క్యూసెక్కుల నీరు సాగర్‌లోకి వెళ్తోంది.
గతంలో కూడా చాలా సార్లు ఈ శ్రీశైలం జలం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఫైట్ నడిచింది. అనుమతి లేని ప్రాజెక్టులు కడుతోంది ఆంధ్రప్రదేశ్‌పై తెలంగాణ ఫిర్యాదు చేస్తే.. అనుమతికి మించిన నీరు వాడుకుంటోందని తెలంగాణపై ఏపీ కంప్లైంట్ చేసింది. ఇప్పుడు మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పుడు కేఆర్‌ఎంబీ ఎలా స్పందిస్తోందో చూడాలి.