AP News: అనంతపురంలో 63 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి - అనంత వెంకటరామిరెడ్డి
Anantapur News | ప్రకృతితో దగా పడ్డ రైతులు సీఎం చంద్రబాబు చేతుల్లోనూ దగా పడ్డారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరారు.
Anantha Venkatarami Reddy | అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రైతాంగం ప్రకృతి చేతిలోనే కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల్లోనూ దగా పడ్డారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. గతంలో వ్యవసాయం దండగ అని చెప్పిన చంద్రబాబు, ఆ తర్వాత తాను మారిన మనిషిని అని ప్రకటించుకున్నారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు మారలేదని, రైతాంగాన్ని ఆదుకునే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.
వ్యవసాయాన్ని వదిలి పెట్టాల్సి వస్తోంది
టమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు నెలల నుంచి రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే వ్యవసాయం క్రమంగా తగ్గుతోందని, చంద్రబాబు నిర్వాకం వల్ల వ్యవసాయాన్ని వదిలిపెట్టే పరిస్థితి దాపురిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో పంటలు సాగు చేసిన ఉమ్మడి అనంతపురం జిల్లా రైతాంగం పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని తెలిపారు. ఖరీఫ్‌లో సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో పంటలన్నీ దెబ్బతిన్నాయన్నారు. ముంగారులో వేసిన రైతులు మాత్రమే పంటలను నిలుపుకున్నారని.. జూలైలో అసలు పంటలు వేయలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఇలాంటి నేపథ్యంలోనే అనంతపురం జిల్లాలో 7 మండలాలు, సత్యసాయి జిల్లాలో 10 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకోవడం భావ్యం కాదన్నారు. తక్షణం ఉమ్మడి అనంతలోని 63 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలన్నారు. కరువు మండలాలుగా ప్రకటించడం వల్ల ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు ఇతరత్రా ప్రయోజనాలు చేకూరుతాయన్నారు.
కేంద్ర బృందం కూడా పర్యటించి రైతులకు ఆర్థికంగా ఆదుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కరువు మండలాల ప్రకటన విషయంలో ప్రభుత్వం తీసుకున్న ప్రామాణికాలు రైతులను దెబ్బతీసే విధంగా ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది జూలైతో పాటు ఆగస్టు 20వ తేదీ వరకు ఎక్కడా వర్షాలు కురవలేదన్నారు. ఆగస్టు చివర్లో వర్షాలు పడ్డాయని చెప్పారు. మొత్తంగా ఖరీఫ్ సీజన్ నాలుగు మాసాలు కలుపుకుని 35 శాతం అధిక వర్షపాతం నమోదైందని అన్నారు. ఇలాంటి తరుణంలో కేవలం 17 మండలాల్లో మాత్రమే కరువు ఉందని ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కూడా ఇన్‌పుట్ సబ్సిడీ అందించలేదని అన్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 46 మండలాల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు.
Also Read: Andhra Pradesh: పులివెందుల ఎమ్మెల్యేను ఫేక్ జగన్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? టీడీపీ పోస్ట్ వైరల్
అనంత ప్రతినిధులు చొరవ తీసుకోవాలి
ఉమ్మడి అనంతకు చెందిన ముగ్గురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని అన్ని మండలాలు కరువు మండలాలుగా ప్రకటన చేయించి రైతాంగాన్ని ఆదుకోవాలని అనంత వెంకటరామిరెడ్డి కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తయిందని, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలను తెలుసుకోవాలన్నారు. చివరకు పశుగ్రాసం కూడా దక్కేలా లేదని తెలిపారు. సమస్యలపై ప్రతిపక్షాలు మాట్లాడితే విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. జిల్లాలో వేరుశనగ పంట మాత్రమే కాకుండా ఆముదం, పత్తి, మిర్చి ఇతరత్రా పంటలతో పాటు ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రజాప్రతినిధులంతా పునరాలోచన చేసుకుని రైతాంగాన్ని ఆదుకునేలా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
Also Read: TDP: ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం