Kurnool MP Sanjeev Kumar : వైసీపీలో బీసీలకు ప్రాధాన్యం చేతల్లో ఉండదు - రాజీనామా చేసిన కర్నూలు ఎంపీ !
YSRCP : కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీలో బీసీలకు ప్రాధాన్యం లేదని మండిపడ్డారు.
Kurnool MP Sanjeev Kumar : వైఎస్ఆర్‌సీపీకి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. అమరావతి తన రాజీనామా ప్రకటన చేశారు. సంజీవ్ కుమార్ ను ఇటీవల వైసీపీ అధినాయకత్వం కర్నూలు పార్లమెంటు స్థానం ఇన్చార్జి పదవి నుంచి తప్పించింది. ఈ కారణంగానే ఆయన మనస్తాపానికి గురై రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తన నిర్ణయంపై డాక్టర్ సంజీవ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.
బీసీలకు ప్రాధాన్యం చేతల్లో ఉండదు !
జగన్‌ను కలవడానికి పోన్ చేస్తే ఎవరూ రిసీవ్ చేసుకోలేదని ఎంపీ సంజీవ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు పెద్దపీట వేస్తామంటారు కానీ.. అది చేతల్లో ఉండదన్నారు. ఐదేళ్లలో అభివృద్ధి పనులు చేయలేకపోయానని విమర్శలు గుప్పించారు. తన అనుచరులు, మద్దతుదారులు, బంధువర్గంతో చర్చించిన తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ఇవాళ ఉదయమే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని, ఇంకా ఏ పార్టీలో చేరాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తన సన్నిహిత వర్గాలతో చర్చించిన తర్వాత భవిష్యత్ గురించి ఆలోచిస్తానని చెప్పారు. మరో 10, 20 ఏళ్లు రాజకీయాల్లో కొనసాగాలని కోరుకుంటున్నానని, తన ఆలోచనలను ప్రజల కోసం ఉపయోగించాలన్నదే తన కోరిక అని డాక్టర్ సంజీవ్ కుమార్ తెలిపారు.
సీఎంను రెండే సార్లు కలిశాను !
ఇటీవల విజయసాయిరెడ్డి అపాయింట్ మెంట్ కోరితే దొరకలేదన్నారు. విజయవాడ వచ్చి నాలుగు రోజులైందని, ఇక ఎక్కువ రోజులు వేచి చూడడం బాగుండదని భావించానని, మనసులో ఉన్నది చెప్పేయడం మంచిదని నిర్ణయించుకుని ఈ వివరాలు తెలుపుతున్నానని సంజీవ్ కుమార్ చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారంలో తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. కర్నూలు పార్లమెంటు పరిధిలో గడిచిన నాలుగునరేళ్లుగా అనుకున్న విధంగా అభివృద్ధి చేయలేకపోయానని చెప్పారు.నాలుగేళ్లలో రెండుసార్లు మాత్రమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి సమస్యలు వివరించే అవకాశం వచ్చిందని సంజీవ్ కుమార్ విమర్శించారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడితే ఎమ్మెల్యేలు చూసుకుంటారని ఆయన చెప్పారని అన్నారు.
అభివృద్ధి చేయలేకపోయా !
పార్లమెంట్ సభ్యుడిగా తన పరిధిలో తాను చేయగలిగిన కార్యక్రమాలు చేశానని సంజీవ్ కుమార్ చెప్పారు. కానీ అనుకున్నన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయలేకపోయానని అన్నారు. తనకు ఈసారి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికి అవకాశం ఉందో లేదో తెలియదని చెప్పారు. వేరే వ్యక్తికి టికెట్ ఇస్తారని తెలిసిందని అన్నారు.పార్టీ నుంచి తనకు ఎలాంటి నేరుగా సంకేతాలు ఇవ్వలేదని సంజీవ్ కుమార్ తెలిపారు. అయినప్పటికీ తన భవిష్యత్ కార్యాచరణ గురించి ఓ నిర్ణయం తీసుకుంటానని అన్నారు. నియోజకవర్గ ప్రజలు, సన్నిహితులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తాను వృత్తిరీత్యా డాక్టర్‌నని అన్నారు. 25 వేల ఆపరేషన్ చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన డాక్టర్‌నని చెప్పారు. రాబోయే రోజుల్లో డాక్టర్‌గా ఉండాలా? ప్రజాప్రతినిధిగా ఉండాలా? అనే విషయాన్ని నియోజకవర్గ ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. నియోజకవర్గ ప్రజల అభిమానం మేరకే తాను నడుచుకుంటానని చెప్పారు. తాను పార్టీలోకి వచ్చేటప్పుడు ఎవరి అనుమతులు తీసుకుని రాలేదని, ఇప్పుడు వైసీపీని వీడేటప్పుడు కూడా ఎవరి అనుమతులు తనకు అవసరం లేదని అన్నారు.