Kurnool SHRC : న్యాయరాజధానిలో తొలి వ్యవస్థ..కర్నూలుకు మానవ హక్కుల కమిషన్..!
విజయవాడలో ఏపీ హెచ్‌ఆర్‌సీని ఏర్పాటు చేయాలన్న గత ప్రభుత్వ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం సవరించింది. కర్నూలులో ఏర్పాటు చేయాలని గెజిట్ ఇచ్చింది. ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఇష్టమని హైకోర్టు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా న్యాయరాజధానిగా నిర్ణయించిన కర్నూలులో తొలి వ్యవస్థ కార్యకలాపాలు ప్రారంభించనుంది. రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ హెచ్‌ఆర్సీ ప్రధాన కార్యాలయం విజయవాడ నుంచి కర్నూలుకు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఈ కార్యాలయం విజయవాడలో లేదు. హైదరాబాద్‌లోనే ఉంది. అయితే గత ప్రభుత్వం 2017లో విజయవాడలో హెచ్‌ఆర్సీ కార్యాలయం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.కానీ కార్యాలయం ఏర్పాటు చేయలేదు. హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు సాగుతున్నాయి. 2017లో జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం సవరించింది.
ఇప్పటి వరకూ మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్‌లో ఉంది. ఏపీ హక్కుల కమిషన్ ఏపీలోనే ఉండాలని హైకోర్టులో కొంత మంది పిటిషన్లు వేశారు. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ పక్కరాష్ట్రంలో ఎందుకు ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మన రాష్ట్రంలోనే ఉండి తీరాలని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోనే హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చింది. ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చుని ప్రభుత్వానికి అధికారం ఉందని హైకోర్టుకూడా స్పష్టం చేయడంతో అడ్డంకులు తొలగిపోయినట్లయింది.
ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా కొన్నాళ్ల క్రితం విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మందాట సీతారామమూర్తి పేరును ప్రకటించారు. కార్యాలయం లేకపోవడంతో ఆయన ఇంట్లోనే బాధ్యతలు తీసుకున్నారు. ప్రభుత్వం మానవ హక్కుల కమిషన్‌ను కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో అక్కడ భవనాలను పరిశీలిస్తున్నారు. రెండు భవనాలను చూసినా అవి అవసరాలకు సరిపోవని నిర్ణయించారు. మూడో భవనం పరిశీలించాల్సి ఉంది. అందుకే హైకోర్టును ప్రభుత్వం నెల రోజుల సమయం అడిగింది. ఈ మేరకు హైకోర్టు కూడా అంగీకరించింది. మానవ హక్కుల కమిషన్ ఏపీలో ఎక్కడైనా పెట్టవచ్చని గతంలోనే చెప్పామని కర్నూలులో పెట్టుకోవచ్చని స్పష్టం చేసింది.
హక్కుల కమిషన్‌తోపాటు లోకాయుక్త వంటి సంస్థలు కూడా రాష్ట్రంలోనే ఉండాల్సిన అవసరం ఉందని హైకోర్టు గతంలోనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఏపీ లోకాయుక్త, ఉపలోకాయుక్త ప్రధాన కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేయనుంది. కాగా, ఇప్పటివరకు లోకాయుక్త, ఉప లోకాయుక్త కార్యాలయాలు హైదరాబాద్ నుంచి పనిచేశాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో న్యాయరాజధాని కర్నూలులో తొలి న్యాయవ్యవస్థలు ఏర్పాటవుతున్నట్లుగా భావించవచ్చు. అక్కడ మొదట హెచ్‌ఆర్సీ, తర్వాత లోకాయుక్త, ఉపలోకాయుక్త కార్యాలయాలు ఏర్పాటు చేస్తే.. ఇక న్యాయసంబంధిత కార్యాలయాన్నింటినీ మెల్లగా తరలించవచ్చని అంచనా వేస్తున్నారు