Bharat Jodo Yatra : రేపటి నుంచి ఏపీలో రాహుల్ భారత్ జోడో యాత్ర
Bharat Jodo Yatra : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రేపు(మంగళవారం) ఏపీలోకి ప్రవేశించనుంది.
Bharat Jodo Yatra : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రే మంగళవారం(అక్టోబర్ 18) ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించనుంది. నాలుగు రోజులు పాటు ఏపీలో రాహుల్ పాదయాత్ర సాగనుంది. రేపు ఉదయం 6.30 నిమిషాలకు ఆలూరు చత్రగుడి హనుమాన్ టెంపుల్ నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభంకానుంది. మంగళవారం ఉదయం 10.30 ఆలూరు సిటీ లోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. రాత్రికి చాగి గ్రామంలో నైట్ హాల్ట్ ఉంటుంది. బుధవారం (19వ తేదీ) ఉదయం 6.30 నిమిషాలకు తిరిగి చాగి నుంచి రాహుల్ యాత్ర ప్రారంభం కానుంది. ఎల్లుండి ఉదయం 10.30 నిమిషాలకు ఆదోని ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీకి యాత్ర చేరుకుంటుంది. రాత్రి 7 గంటలకు ఆదోనిలోని ఆరేకల్ లోని జెల్లి నాగన్నా తాతా దర్గా నుంచి యాత్ర సాగనుంది. ఎమ్మిగనూరు చెన్నాపురం క్రాస్ వద్ద రాహుల్ రాత్రి బస చేయనున్నారు. మరుసటి రోజు 20వ తేదీ ఉదయం 6.30 నిమిషాలకు పాదయాత్ర ఎమ్మిగనూరు నుంచి ప్రారంభం కానుంది. గురువారం 11 గంటలకు యెమ్మిగనూరు ధర్మాపురం గ్రామానికి రాహుల్ యాత్ర చేరుకుంటుంది. సాయంత్రం నాలుగు గంటలకు ధర్మాపురం టోల్ గేట్ వద్దకు, రాత్రి ఏడు గంటలకు కల్లుదేవర కుంటకు పాదయాత్ర చేరుకుంటుంది. మంత్రాలయం అవుట్ కర్ట్స్ లో రాత్రి రాహుల్ బస చేయనున్నారు. 21వ తేదీ ఉదయం 6.30 నిమిషాలకు మంత్రాలయం టెంపుల్ సర్కిల్ నుంచి రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 10.30 నిమిషాలకు కర్ణాటకలోని రాయచూర్ లోకి రాహుల్ యాత్ర కొనసాగనుంది.
23న తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర
భారత్ జోడో యాత్ర అతి త్వరలో తెలంగాణలోకి ప్రవేశించనుంది. ఈ నెల 23 వ తేదీన భారత్ జోడో యాత్ర తెలంగాణలో అడుగు పెట్టనుంది. నారాయణపేట జిల్లా శివారులోని కృష్ణ మండలం గూడవల్లూరు గ్రామంలోకి యాత్ర తొలుత ప్రవేశిస్తుంది. ఆ రోజు సాయంత్రానికి మక్తల్ చేరుకొని దీపావళి సందర్భంగా 24, 25 తేదీల్లో పాద యాత్రకు రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు విరామం తీసుకోనున్నారు. ఆయన బస కూడా అక్కడే ఉండనుంది. మళ్లీ ఈ నెల 26 నుంచి మక్తల్‌లో తిరిగి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే, రాహుల్ గాంధీ తెలంగాణలోకి ప్రవేశించాక, యాత్ర కొనసాగాల్సిన రూట్ మ్యాప్‌పై కూడా సమీక్ష జరిగింది. టీపీసీసీ కీలక నేతలు శనివారం గాంధీ భవన్‌లో ఈ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, ఏఐసీసీ పర్యవేక్షకులు బైజు, సుశాంత్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.
ఆలయాల సందర్శన
తెలంగాణలో ప్రముఖ దేవాలయాలు, చర్చిలు, మసీదులను రాహుల్ గాంధీ సందర్శించనున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ నగర శివారులో ఉన్న చిలుకూరి బాలాజీ దేవాలయాన్ని దర్శించుకొని స్వామి ఆశీస్సులు రాహుల్ పొందనున్నట్లు తెలుతస్తోంది. తర్వాత ఆసియా ఖండంలోనే అతి పెద్ద మెదక్ చర్చికి వెళ్తారు. హైదరాబాద్ నగరానికి 44 కిలోమీటర్ల పరిధిలో ఉన్న జహంగీర్ దర్గాను కూడా సందర్శిస్తారని భారత్ జోడో యాత్ర వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వీటిని సందర్శించడం ద్వారా మత విభజన రాజకీయాలకు గట్టి సమాధానం ఇచ్చినట్టువుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.