KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?
అమరావతిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ పనులు జరగడం లేదన్నారు.
KTR On Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కార్పొరేట్ సంస్థల విరాళాలతో హైదరాబాద్ సుందరీకరణ పనులను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. హైదరాబాద్ పట్టణం గురించి .. హైదరాబాద్‌కు ఉన్న అనుకూలతల గురించి ప్రసంగించారు. ఈ సందర్భంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెలవప్‌మెంట్ అధారిటీ విస్తీర్ణం గురించి ప్రస్తావించారు. దేశంలోనే హెచ్‌ఎండీఏ అతి పెద్దదన్నారు. ఈ సందర్భంలోనే అమరావతిని గుర్తు చేసుకున్నారు. హెచ్‌ఎండీఏ కంటే అమరావతి అతి పెద్దదిగా నిర్ణయించారని..కానీ ప్రస్తుతం అక్కడ పనేం జరగడం లేదన్నారు. అంటే... పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్న అర్థంలో మాట్లాడారు.
ఇదే సమావేశంలో కేటీఆర్ విశాఖ, విజయవాడ, గుంటూరు నగరాల గురుంచి కూడా మాట్లాడారు. అవి కూడా బాగున్నాయన్నారు. అయితే కాస్త హాస్యోస్ఫోరకంగా ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో గుంటూరుకు చెందిన ఓ మిత్రుడు తనకు చెప్పిన విషయాన్ని ఓ సమావేశంలో చెబితే పెద్ద వివాదం అయిందని అందుకే అలాంటి విషయాలను ప్రస్తావించబోనన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా పోయింది. దీంతో అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఖరారు చేసి సీఆర్డీఏను ఏర్పాటు చేసింది. 2014లో సీఆర్డీఏ చట్టాన్ని ముందుకు తెచ్చింది. కృష్ణాజిల్లా నందిగామ మొదలు, గుంటూరు జిల్లా చిలకలూరిపేట వరకు సీఆర్డీఏ విస్తరించింది.
17 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని నగరంతో పాటు 8630 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ వ్యవస్థ ఏర్పాటైంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రెండు నగరపాలక సంస్థలు, పది మున్సిపాలిటీలు, 58 మండలాలు సీఆర్‌డీఏ పరిధిలో ఉంటాయి. ఉడాలో ఉన్నవాటితోపాటు నూతనంగా కృష్ణా జిల్లాలోని మొవ్వ, చల్లపల్లి, ఘంటసాల, పామర్రు, గుడ్లవల్లేరు, మోపిదేవి మండలాలు సీఆర్‌డీఏ పరిధిలోకి చేర్చారు. వీటితోపాటు గుంటూరు జిల్లాలోని వేమూరు, కొల్లూరు, అమృతలూరు, పెదకూరపాడు, ముప్పాళ్ల, అచ్చంపేట, క్రోసూరు మండలాలు పూర్తిగానూ, పెదనందిపాడు, నాదెండ్ల మండలాల్లో కొన్ని గ్రామాలు సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చాయి.
కోర్ క్యాపిటల్ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు వేసింది. దాదాపుగా రూ. యాభై వేల కోట్ల విలువైన పనులు రాజధానిలో జరిగేవి. అయితే ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ అమరావతి నిర్మాణ పనుల్ని పూర్తిగా నిలిపివేశారు. నాలుగేళ్ల నుంచి అక్కడ ఒక్క పని కూడా సాగడం లేదు. తర్వాత మూడు రాజధానుల వివాదం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంది. అమరావతిలో నిర్మాణాలు జరుగుతూ ఉంటే.. పనులు కొనసాగుతూ ఉంటే... హెచ్‌ఎండీఏ కన్నా పెద్దది అయి ఉండేదన్న ఉద్దేశంలో కేటీఆర్ ఆ వ్యాఖ్యలు చేసినట్లుగా అర్థం చేసుకోవచ్చు.