Ram Mohan Naidu: అప్పుడు తండ్రి, ఇప్పుడు కుమారుడు - శ్రీకాకుళాన్ని రెండుసార్లు వరించిన కేబినెట్ పోస్ట్
AP Latest News: వరుసగా మూడోసారి శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఎన్నికైన రామ్మోహన్ నాయుడును కేంద్ర మంత్రి పదవి వరించింది. అంతకుముందు ఆయన తండ్రి ఎర్రనాయుడు కూడా ఇలాంటి బాధ్యతలే నిర్వర్తించారు.
Kinjarapu Ram Mohan Naidu in Modi Cabinet: కేంద్ర మాజీమంత్రి, దివంగత ఎర్రన్నాయుడి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్‌నాయుడును తాజాగా కేంద్ర మంత్రి పదవి వరించబోతోంది. మోదీ 3.0 కేబినెట్‌లో రామ్మోహన్ నాయుడుకు బెర్తు దక్కడం ఇప్పటికే ఖరారు కాగా.. ఈ సాయంత్రం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మోదీతో పాటు కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
రామ్మోహన్ నాయుడు వరుసగా మూడోసారి శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైఎస్సార్సీపీ గాలి వీచినా తట్టుకుని నిలబడి, ఎంపీగా గెలిచారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎర్రన్నాయుడి కుమారుడిగా, ఉత్తరాంధ్ర నుంచి వరుసగా గెలుస్తున్న యువనేతగా, పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుభవమున్న నాయకుడిగా రామ్మోహన్ నాయుడికి మంత్రి పదవి ఖాయమని అందరూ ఊహించారు. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యంతో పార్లమెంట్ చర్చల్లో ఆయన ఇప్పటికే ముద్ర వేశారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు రామ్మోహన్‌నాయుడికి కేంద్ర క్యాబినెట్ బెర్తు ఖరారు చేశారు.
అప్పట్లో తండ్రికి ఛాన్స్
సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామిగా టీడీపీకి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం వచ్చినప్పుడల్లా ఉత్తరాంధ్రకు చోటిస్తున్న చంద్రబాబు ఈ ప్రాంతం తమకెంత ముఖ్యమో చెప్పకనే చెబుతున్నారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో టీడీపీ చేరడంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా కింజరాపు ఎర్రన్నాయుడికి అవకాశం ఇచ్చారు. ఈయనే రామ్మోహన్ నాయుడు తండ్రి. తర్వాత 2014లో ఎన్డీయే సర్కారులో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజును మోదీ ఎంపిక చేశారు. ఇప్పుడు ఎర్రన్నాయుడు కుమారుడు మళ్లీ రామ్మోహన్ నాయుడికి అవకాశం ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రపై టీడీపీకున్న మక్కువను మరోసారి ప్రకటించినట్లయింది.
అతి పిన్న వయస్కుడు
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మించారు. అతని వయసు 36 సంవత్సరాలు. బీటెక్, ఎంబీఏ పూర్తి చేశారు. రామ్మోహన్ తల్లిదండ్రుల పేరు విజయలక్ష్మి, ఎర్రన్నాయుడు కాగా భార్య పేరు శ్రావ్య. నిహిరఅన్వి, శివాంకృతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రి దివంగత ఎర్రన్నాయుడు 2012 నవంబరు 2న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామ్మోహన్‌నాయుడు రాజకీయ రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. 2014లో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సైకిల్ యాత్ర చేసి, పార్టీ శ్రేణులకు, ప్రజలకు చేరువయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున తొలిసారి పోటీ చేసి 1.27 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు. అప్పుడు ఆయన వయసు 27 ఏళ్లు మాత్రమే.
2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఓటమిపాలయినా తాను మాత్రం ఎంపీగా గెలిచి, పట్టు నిలబెట్టుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 3.27 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ బాధ్యలు నిర్వహిస్తున్నారు. రామ్మోహన్‌నాయుడి చిన్నాన్న అచ్చెన్నాయుడు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు. సోదరి ఆదిరెడ్డి భవాని మొన్నటి వరకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఎన్నికల్లో ఆమె భర్త ఆదిరెడ్డి వాసు అక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామ్మోహన్ భార్య శ్రావ్య తండ్రి బండారు సత్యనారాయణమూర్తి అనకాపల్లి జిల్లా మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.