AP Cabinet Meet : జీపీఎస్ బిల్లుకు ఆమోదం - ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే !
ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగుల జీపీఎస్ బిల్లుకు ఆమోదం తెలిపారు.
AP Cabinet Meet : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తెస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అయితే సాంకేతిక కారణాలతో సీపీఎస్ ను రద్దు చేయలేకపోవడంతో ప్రత్యామ్నాయంగా జీపీఎస్ ను అమల్లోకి తెచ్చారు. ఈ పథకం ద్వారా గ్యారంటీగా పెన్షన్ అందుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఉద్యోగి రిటైర్డ్ అయిన సమయానికి ఇంటి స్థలం లేనివారికి కచ్చితంగా ఇంటి స్థలం ఉండాలని సీఎం జగన్ అన్నారు. ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలిన్నారు. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలు కూడా ఆరోగ్య శ్రీ కింద అందరూ కవర్ అయ్యేలా చూడాలని సూచించరు. వారి పిల్లల చదువులు కూడా ఫీజు రియింబర్స్ మెంట్ కింద ఉండి ప్రయోజనాలు అందేలా చూడాలని.. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.
అలాగే జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పథకం ఏర్పాటుకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం లో భాగంగా ప్రిలిమ్స్, మెయిన్స్ లో పాసయిన వాళ్లకు ప్రోత్సాహకాలు ఇస్తారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపారు. ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లుకి ఆమోదం తెలిపారు. రైవేటు యూనివర్శిటీల చట్టంలో సవరణపై బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రఖ్యాత యూనివర్శిటీలతో సంయుక్త సర్టిఫికేషన్ ఉండేలా చట్ట సవరణ చేశారు.
ఇందులో చదువుతున్న విద్యార్థుల డిగ్రీలకు జాయింట్ సర్టిఫికేషన్ ఉండాలని.. ప్రైవేటు యూనివర్శిటీల్లో కూడా నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మార్పుల వల్ల పిల్లలకు మంచి జరుగుతుందని ప్రభుత్వంతెలిపింది. ఇంతకుముందు ఉన్న ప్రైవేటు యూనివర్శిటీలు, కొత్తగా ఏర్పాటు చేసే ప్రైవేటు యూనివర్శిటీలకు ప్రపంచంలోని టాప్ 100 యూనివర్శిటీలతో టై అప్ ఉండేలా చట్ట సవరణ చేయనున్నారు. దీని వల్ల జాయింట్ సర్టిఫికేషన్‌కు వీలు కలుగుతుందన్నారు. ఇప్పుడు నడుస్తున్న ప్రైవేటు కాలేజీలు యూనివర్శిటీలుగా మారితే వచ్చే అదనపు సీట్లలో 35శాతం సీట్లు కన్వీనర్ కోటాలోకి వస్తాయి. దీని పిల్లలకు మేలు జరుగుతుందని సీఎం జగన్ తెలిపారు.
కురుపాం ఇంజనీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణం, అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు, పీఓటీ చట్ట సవరణ, భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్, దేవాదాయ చట్ట సవరణ బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరో వైపు ఐబీ సిలబస్‌ను ప్రవేశపెట్టే నిర్ణయానికి ఆమోదం తెలిపింది రాష్ట్ర మంత్రివర్గం. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత ఐబీ సంస్థతో ఎంఓయూ కార్యక్రమం కూడా జరిగింది. సింగపూర్, వాషింగ్టన్ డీసీ, జెనీవా, యూకేల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఐబీ ప్రతినిధులు పాల్గొన్నారు.