Karthika Masam 2022: భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైల మల్లన్న క్షేత్రం- వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్!
Karthika Masam 2022: కార్తీక మాసం మూడో సోమవారాన్ని పురస్కరించుకొని శ్రీశైలం మల్లన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
Karthika Masam 2022: కార్తీక మాసం మూడో సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు అన్నీ భక్తులతో నిండిపోయాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న దర్శనానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. తెల్లవారుజాము నుంచే పాతాళ గంగలో స్నానాలు చేసి.. స్వామి అమ్మవార్ల దర్శనాలు చేసుకుంటున్నారు. భక్తులు ఎక్కువగా ఉండడంతో క్యూలైన్లన్నీ రద్దీగా ఉన్నాయి. స్వామి వారి ఉచిత దర్శనానికి దాదాపు 5 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. అయితే కార్తీక మాసం భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని స్వామి వారి స్పర్శ దర్శనాలను రద్దు చేశారు. గర్భాలయం 5 వేల రూపాయల అభిషేకాలను కూడా రద్దు చేశారు. 10500 రూపాయల సామూహిక అభిషేకం చేసుకున్న వారికి కూడా అలంకార దర్శనం మాత్రమే కల్పించారు. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశారు.
కేవలం అమ్మవారి ఆలయంలో నిర్వహించే కుంకుమ అర్చనలు, ఆశీర్వచన మండపంలో మాత్రమే నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అయితే భక్తుల రద్దీతో శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కార్లు, ఇతర వాహనాలన్నీ రెండు గంటలపాటు రోడ్లపై నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి ముఖద్వారం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర రోడ్లపై కార్లు పోగా.. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీశైలం టోల్ గెట్ నుంచి సాక్షి గణపతి, ముఖద్వారం వరకు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయ కల్గుతోంది. ట్రాఫిక్ అదుపు చేసేందుకు శ్రీశైలం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే రోడ్లపై వాహనాలు అడ్డదిడ్డంగా నిలిచిపోపోవడంతో పోలీసులు కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
శివనామస్మరణతో మార్మోగుతున్న శైవాలయాలు..
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ, అమరావతి, పెదకాకాని ఆలయాలకు వేకువ జాము నుంచే భక్తులు పోటెత్తారు. కార్తీక దీపాలు వెలిగించి మహిళా భక్తల దీపారాధన చేస్తున్నారు. ఆ శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలో కార్తీక మాసం మూడో సోమవారం కావడంతో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. శివకోటి గ్రామంలో శ్రీ రాముడు ప్రతిష్టించిన శివకోటి లింగాలలో... కోటి లింగంగా ప్రసిద్ధి చెందిన శివకోటి శ్రీ ఉమా శివలింగేశ్వర స్వామి వారి ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ నెలకొంది.
శివయ్య కు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రాజోలు నియోజకవర్గ పరిధిలోని శివాలయాలన్నీ శివ నామస్మరణతో మార్మోగిపోతున్నాయి. పల్నాడు జిల్లా అరావతి శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు కిటకిటలాడుతున్నారు. కార్తీకమాసం మూడో సోమవారం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండి స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేస్తున్నారు. శివయ్యను భక్తి, శ్రద్ధలతో కొలుస్తూ.. మొక్కులు చెల్లించుకుంటున్నారు.
భక్తులతో కిక్కిరిసి శ్రీగిరి మల్లన్న ఆలయం ముక్కంటిశుని దర్శనానికి ఆరు గంటల సమయం కార్తీక దీపాలు వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్న భక్తులు