Chandrababu Tour : నేడు కడప జిల్లాలో చంద్రబాబు టూర్, పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం
Chandrababu Tour : టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. కమలాపురంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
Chandrababu Tour : టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజులపాటు రాయలసీమ జిల్లాల్లో పర్యటించున్నారు. టీడీపీ చేపట్టిన 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో నేడు(18వ తేదీ) కడప జిల్లాలోని కమలాపురంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో జిల్లా స్థాయి నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాల నేతలు, కార్యకర్తలు పాల్గొనున్నారు. సాయంత్రం కమలాపురంలో 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో పాల్గొనున్న చంద్రబాబు అనంతరం బహిరంగసభలో ప్రసంగించనున్నారు.
చంద్రబాబు రాయలసీమ టూర్
ఈ నెల 19న నంద్యాల జిల్లాలోని డోన్ లో చంద్రబాబు పర్యటించనున్నారు. 20న సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయా జిల్లాల్లో ఉదయం కార్యకర్తలు, ముఖ్య నేతల సమావేశంలో పాల్గొంటారు. మహానాడు లోపు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను చుట్టేలా చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
పర్యటనలు షురూ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటూ వైసీపీ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు. ఉత్తరాంధ్ర, కుప్పంలో పర్యటించిన ఆయన ఈసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాను టార్గెట్ చేశారు. చంద్రబాబు రాయలసీమ జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది.
ఇవాళ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం, రేపు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం, 20న అనంతపురం జిల్లా పెనుకొండలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నియోజకవర్గాల్లో బాదుడే బాదుడు కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత నియోజకవర్గం డోన్ లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఉత్తరాంధ్ర, కుప్పంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన రావడంతో రాయలసీమ జిల్లాల్లో నిర్వహణకు టీడీపీ సిద్ధమైంది. రాయలసీమ తర్వాత కోస్తా జిల్లాల్లో చంద్రబాబు టూర్ కు టీడీపీ ప్లాన్ చేస్తోంది. అయితే అధికార వైసీపీ "గడప గడపకు మన ప్రభుత్వం" అంటూ పర్యటనలు చేస్తుంది. టీడీపీ బాదుడే బాదుడు అంటూ జనాల్లోకి వెళ్తోంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ టూర్ మొదలయ్యాయి. పవన్ కల్యాణ్ కూడా కౌలు రైతు భరోసా యాత్ర చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉన్నా వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పర్యటనలు స్టార్ట్ చేశాయి. అలాగే పొత్తుల రాజకీయాలు చేస్తున్నాయి.
మహానాడు తేదీలు ఖరారు
తెలుగుదేశం పార్టీ మహానాడు తేదీలు ఖరారు చేశారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో టీడీపీ మహానాడు నిర్వహించనున్నారు. మహానాడు నిర్వహణకు 80 ఎకరాల స్థలాన్ని టీడీపీ శ్రేణులు ఎంపిక చేశాయి. ఒంగోలు శివారు మండవవారిపాలెంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మహానాడు పనులకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భూమిపూజ చేయనున్నారు. బుధవారం ఉదయం 11.11 నుంచి 11.20 గంటల మధ్య భూమిపూజ చేయనున్నారు. భూమిపూజ చేసిన అనంతరం మహానాడు పనులు ప్రారంభంకానున్నాయి.