Kadapa News: జమ్మలమడుగులో హైఅలర్ట్! అక్కడికి ఏకంగా 500 అదనపు భద్రతా బలగాలు
AP Latest News: జమ్మలమడుగులో హై అలర్ట్ మాత్రమే కాక బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డికి 4+4, కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డికి 3+3, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 4+4 గన్ మేన్‌లను ఇచ్చారు.
Jammalamadugu News: కడప జిల్లా జమ్మలమడుగులో హై అలెర్ట్ ప్రకటించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతుంది. అల్లర్లు జరగకుండా డీఎస్పీ యశ్వంత్ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా జమ్మలమడుగుకు 500 మంది అదనపు బలగాలు చేరుకున్నాయి.
జమ్మలమడుగులో ఘర్షణలు తలెత్తకుండా వైఎస్ఆర్ సీపీ, బీజేపీ, టీడీపీ కార్యాలయాల వద్ద భారీగా పోలీసు బలగాలు మొహరించాయి. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలోని ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి, యర్రగుంట్ల మండలం నిడిజివ్వి గ్రామంలోని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి జమ్మలమడుగులో పరిస్థితి ప్రశాంతంగా ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా జమ్మలమడుగులో పోలీస్ కవాతు నిర్వహించారు. జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డికి 4+4, కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డికి 3+3 గన్ మేన్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 4+4 గన్ మేన్ సౌకర్యం కల్పించారు.
ఈ నెల 13వ తేదీన ఎన్నికల సందర్భంగా జమ్మలమడుగు వెంకటేశ్వర కాలనీ 116, 117 పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ - కూటమి నాయకుల మధ్య ఘర్షణ తలెత్తింది. పరిస్థితి చేజారకుండా టీడీపీ, బీజేపీ, వైసీపీ నాయకులను గృహ నిర్బంధంలో ఉంచామని డీఎస్పీ తెలిపారు. జమ్మలమడుగులో 144 సెక్షన్ కొనసాగుతుందని ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.