Junior NTR on Taraka Ratna: అన్న చికిత్సకు స్పందిస్తున్నారు, కానీ ఆ విషయం చెప్పలేం - ఎన్టీఆర్
ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్లిన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తారకరత్నను చూసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన ప్రస్తుతం పోరాడుతున్నాడని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్లిన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తారకరత్నను చూసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తారకరత్న ఎక్మోపై లేరని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. వైద్యులు చేస్తున్న చికిత్సకు స్పందిస్తుండడం కాస్త ఊరటనిచ్చే అంశమని అన్నారు. అయితే, క్రిటికల్ కండిషన్ నుంచి బయటపడ్డారని చెప్పలేమని అన్నారు. తన అన్న తారకరత్నకు ఎన్‌హెచ్ హాస్పిటల్‌లో మెరుగైన వైద్యం అందుతోందని అన్నారు. ఆత్మబలం, మనోబలం, అభిమానుల ఆశీస్సులు, తాతగారి ఆశీస్సులతో మళ్లీ కోలుకొని, ఇంతకుముందులాగే మనందరితో కలిసి తిరగాలని ఆకాంక్షించారు. ఇలాంటి పరిస్థితిలో తమకు అండగా నిలిచిన కర్ణాటక ప్రభుత్వానికి, తనకు ఆప్తుడైన కర్ణాటక ఆరోగ్య మంత్రి కేశవ సుధాకర్ కు ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
అభిమానుల ఆశీస్సులు, ప్రార్థనల ఫలితంగా తారకరత్న త్వరగా కోలుకోవాలని కల్యాణ్ రామ్ ఆకాంక్షించారు. అభిమానులు ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు.
స్పందించిన బాలకృష్ణ
అంతకుముందు తారకరత్న ఆరోగ్య విషయంపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. అవయవాలు అన్నీ బాగానే పని చేస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ, ఆరోగ్యం మెరుగుపడడం కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. గుండెలో క్లాట్ అవడం, కాస్త ఇంటర్నల్ బ్లీడింగ్ అవడం వల్ల స్టంట్ వేయడం కుదరలేదని చెప్పారు. ప్రస్తుతం వైద్యులు స్టెప్ బై స్టెప్ పర్యవేక్షిస్తున్నారని అన్నారు.
"ఇవాళ మేం కొంచెం గిచ్చినా రెస్పాండ్ అయ్యాడు. ఇంకో రెండు మూడు సార్లు గిచ్చితే అవ్వలేదు. దానికోసం కొంచెం టైం పడుతుంది. మెడికేషన్ పని చేయాలి కదా? కొంచెం టైం తీసుకుంటుంది. కళ్లలో కూడా కొంచెం మూమెంట్స్ ఉన్నాయి’’ అని బాలకృష్ణ అన్నారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో హైదరాబాద్ నుంచి వచ్చిన గుండె వైద్య నిపుణులు వైద్యం చేస్తున్నారని బాలకృష్ణ చెప్పారు. ఆస్పత్రిలో వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. అభిమానుల ప్రార్థనలు, ఆశీస్సులతో తారకరత్న త్వరలోనే కోలుకుంటారని బాలకృష్ణ ఆకాంక్షించారు.
ఆస్పత్రికి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్
బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను చూసేందుకు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా వచ్చారు. నందమూరి కుటుంబంతో రాజ్ కుమార్ కుటుంభానికి మంచి అనుబంధం ఉంది.
కర్ణాటక ప్రభుత్వం సహకారం
తారక రత్నను చూసేందుకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, నారా బ్రాహ్మిణి బెంగళూరుకు వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరు వస్తున్నారని తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి పంపించారు. అంతకుముందు ప్రత్యేక విమానంలో వచ్చిన వీరిని ఆరోగ్య మంత్రి ఎయిర్ పోర్టులోనే కలిశారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, ఇతర కుటుంబ సభ్యులు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి చేరుకున్నారు. వీరితో పాటే టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు, లోకేష్ భార్య నారా బ్రాహ్మణి కూడా ఆస్పత్రికి వచ్చారు.
ముందుగా తారకరత్నను చూసిన కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు వారికి తెలిపారు. అవసరమైతే విదేశాల నుంచి ఎక్స్‌పర్ట్స్‌ను పిలిపించాలని జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సహా కుటుంబ సభ్యులంతా కోరినట్లు తెలుస్తోంది.
తారకరత్న ఆరోగ్య పరిస్థితులపై కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకరన్ కూడా ఆరా తీశారు. నారాయణ హృదయాలకు వచ్చి వైద్యులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులకు పూర్తి సమాచారం తెలియజేయాలని ముఖ్యమంత్రి బొమ్మై.. మంత్రిని ఆదేశించినట్లు సమాచారం. అనంతరం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో కూడా మంత్రి మాట్లాడారు.