JC Prabhakar : కంటతడి పెట్టుకున్న జేసీ ప్రభాకర్ - లోకేష్ గురించి ఏం చెప్పారంటే ?
జేసీ ప్రభాకర్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. నారా లోకేష్ ఎంతో కష్టంతో పాదయాత్ర చేస్తున్నారన్నారు.
JC Prabhakar : అనంతపురం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కంట తడి పెట్టారు. పాదయాత్రలో లోకేష్ పడుతున్న కష్టాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. తాడిపత్రి నియోజకవర్గంలో పాదయాత్ర విజయవంతంగా పూర్తయింది. ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన కార్యకర్తలు లేకపోతే తాను లేనన్నారు. చంద్రబాబు చేసిన మంచి పనులతో ప్రజల మనిషి అయ్యారని పేర్కొన్నారు.. ఇక, లోకేష్ జనం కోసం పాదయాత్ర చేస్తున్నాడు.. అసలు లోకేష్ కు ఏం తక్కువ..? ఎంతో విలాసవంతమైన జీవితం వదిలేసి.. ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నాడు.. లోకేష్ కాళ్లకు బొబ్బలు వచ్చాయి.. ఆ బొబ్బలను చూస్తే బాదేసిందని జేసీ ప్రభాకర్ రెడ్డి కంట నీరు పెట్టుకున్నారు.
‘‘ఆంధ్రప్రదేశ్ ను రక్షించడానికే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నావు. ఎన్నో బాధలు పడుతున్నావు.. అయినా పాదయాత్ర ఆపకు. నీ పాదయాత్ర ఇప్పటికే సూపర్ సక్సెస్ అయింది. గాయాలు అయినా పాదయాత్రను కొనసాగిస్తున్నావు. ఎంతోమంది కష్టాలు తెలుసుకుంటున్నావు. మేమున్నామని భరోసా ఇస్తున్నావు. నీ పాదయాత్రకు ఎంతోమంది బ్రహ్మరథం పడుతున్నారు’’ అని అన్నారు. చంద్రబాబు దంపతులు తమ కుమారుడిని రాష్ట్రం కోసం త్యాగం చేశారని ప్రభాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు చేసిన పనులు ప్రజలకు ఆయన్ను దగ్గర చేశాయని, కానీ లోకేశ్ ప్రజల మనిషిగా ప్రజల ముందుకు వస్తున్నారన్నారు. ఎన్టీఆర్ ను చూసినట్టుగా జనం లోకేశ్ ను చూస్తారని చెప్పారు.
‘లోకేశ్.. నువ్వు నడుస్తుంటే నాకు బాధేసింది. నా కొడుకు మూడు రోజులు నడిచినందుకే నాకు బాధ అయింది. ఏపీ పిల్లల కోసం నువ్వు పోరాడుతున్నావు. బాధను దిగమింగుకో. నీ కష్టం నేను చూశాను’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. తాడిపత్రిలో లోకేష్ పాదయాత్ర ఉద్రిక్తల మధ్య సాగింది. పోలీసులు అడుగడుగునా ఆంక్షలు పెట్టారు. అయినా తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు.
మరోవైపు.. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.. తాడిపత్రిలో నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కావడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.. టపాసులు కూడా కాల్చారు. అనుమతి లేకుండా టపాసులు కాల్చారని.. ఓ హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు .. ఎక్స్ ప్లోజివ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.