Pawan Kalyan: జనసేన స్వలాభం కోసం వచ్చిన గుంపు కాదు.... పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో 2024 ఎన్నికలపై దిశానిర్దేశం... పవన్ కల్యాణ్ కామెంట్స్
ఈ ఏడాది పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో 2024 ఎన్నికలకు దిశానిర్దేశం చేసుకుందామని పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులతో అన్నారు. జనసేన పార్టీ అంటే స్వలాభం కోసం, స్వప్రయోజనం కోసం వచ్చిన గుంపు కాదన్నారు.
కరోనా మూడో వేవ్ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జనసేన పార్టీ కార్యనిర్వాహక సభ్యులతో పవన్ కల్యాణ్ సమావేశం నిర్వహించారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ రోజు రోజుకీ బలం పుంజుకుంటోంది. అయితే పార్టీ నిర్మాణం అనేది కష్టసాధ్యమైన పని. సంస్థాగత నిర్మాణం లేదంటూ ప్రతి ఒక్కరు తేలిగ్గా చెప్పేస్తున్నారు. ఆ మాట మాట్లాడే వారు ఎవరూ పార్టీని స్థాపించలేదు. చిన్నపాటి సంస్థను నడిపించలేని వ్యక్తులే అలాంటి మాటలు అంటూ ఉంటారు. జనసేన పార్టీ అంటే స్వలాభం కోసం, స్వప్రయోజనం కోసం వచ్చిన గుంపు కాదు. ఒక కట్టుదిట్టమైన ఆలోచనా విధానంతో వ్యక్తిగత అజెండాలు లేకుండా ప్రజా ప్రయోజనాల కోసం నిలబడేలాగా పార్టీని ముందుకు తీసుకువెళ్లడం ఎంతో కష్టసాధ్యమైన విషయం. పార్టీ స్థాపించిన ఏడేళ్ల తర్వాత యువత ఈ రోజుకి నాయకుల స్థాయికి రాగలిగే పరిస్థితిలో ఉన్నారు. ఆ యువత మీ వెంట నిలబడతామన్న ధైర్యం నింపితే ఈ రోజుకి రాష్ట్రవ్యాప్తంగా 676 మండలాలకుగాను 403 మండలాల్లో అధ్యక్షులను నియమించుకున్నాం. ఈ ఏడాదిలో సంపూర్ణంగా 175 నియోజకవర్గాల్లో బూత్ కమిటీలు నిర్మాణం చేసుకుందాం' అని పవన్ కల్యాణ్ అన్నారు.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఈ రోజు సాయంత్రం పార్టీ కార్యనిర్వాహక సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు.
— JanaSena Party (@JanaSenaParty) January 11, 2022
Link: https://t.co/9CO7jMV31v pic.twitter.com/w5oWUnfS7R
పొత్తులపై స్పందించిన పవన్
పలు పార్టీలు జనసేన పొత్తులు కోరుకున్నప్పటికీ ముందుగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతామని జనసేన పవన్ కల్యాణ్ అన్నారు. మంగళవారం పార్టీ కార్యనిర్వాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన పవన్ కల్యాణ్... రాష్ట్రంలో ఇతర రాజకీయపార్టీలతో పొత్తులపై స్పందించారు. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నామని, ఈ వ్యవహారంలో అంతా ఒకటే మాట మీద ఉందామన్నారు. ఎవరు ఏం మాట్లాడినా.. మైండ్ గేములు ఆడినా, వారి గేమ్ లో పావులు కావద్దని జనసేన నేతలకు పవన్ మార్గనిర్దేశం చేశారు. పొత్తులపై తన ఒక్కడి నిర్ణయం మీద ముందుకు వెళ్లనని, పూర్తి ప్రజాస్వామ్యబద్దంగా ప్రతీ జనసైనికుడి ఆమోదంతోనే ముందుకు వెళ్తానన్నారు. అప్పటి వరకు ఎవరేం మాట్లాడినా సంయమనంతోనే ఉండాలని పార్టీ నాయకత్వానికి సూచించారు.
Also Read: ప్రతి జనసైనికుడి ఆలోచన ప్రకారమే పొత్తు.. టీడీపీ వన్ సైడ్ లవ్ పై పవన్ కల్యాణ్ స్పందన !
ఆవిర్భావ దినోత్సవ నిర్వహణకు కమిటీ
గత ఏడాది కోవిడ్ పరిస్థితుల వల్ల పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని(మార్చి 14) ఘనంగా నిర్వహించుకోలేకపోయామని పవన్ అన్నారు. ఈ ఏడాదైనా సభను ఘనంగా జరుపుకోవాలన్నది ఆకాంక్ష అన్నారు. దాని కోసం అయిదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేస్తామన్నారు. ఆవిర్భావ సభలో 2024 ఎన్నికలకు ఎలా సమాయత్తం కావాలి అనే అంశాలను నిర్ణయించుకుందామన్నారు.
Also Read: ఏపీలో ట్రయాంగిల్ పొలిటికల్ లవ్ స్టోరీ ! క్లైమాక్స్ మలుపు తిప్పుతుందా ?
ప్రజా సమస్యలపై పోరు
ఏడాది పొడుగునా రైతుల కోసం పార్టీ శ్రేణులు వివిధ స్థాయిల్లో చేసిన పోరాటానికి పవన్ హర్షం వ్యక్తం చేశారు. వరి, మిర్చి రైతులకు, తుపానుల వల్ల పంటను కోల్పోయిన రైతులకు అండగా నిలబడి ప్రభుత్వం పరిహారం ఎలా ఇప్పించాలనే దాని మీద బలమైన ప్రణాళిక ఉందన్నారు. ఈ నెలలో రైతాంగం కోసం చేసే పోరాటాన్ని ధర్నాల రూపంలో ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించామని, కోవిడ్ వల్ల దాన్ని ముందుకు తీసుకువెళ్లలేకపోయామన్నారు. జాబ్ క్యాలెండర్, ఇతర సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని శ్రేణులకు పవన్ మార్గనిర్దేశం చేశారు.
Also Read: ఏపీలో బీజేపీ - జనసేన అనధికారిక కటీఫ్ ! బద్వేలు పోటీనే తేల్చేసిందా ?