Pawan Kalyan : ధర్మపరిరక్షణ, ప్రజాక్షేమం కోసం యాగం - వారాహి యాత్ర ప్రారంభానికి పవన్ సన్నాహాలు !
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీసులో యాగం నిర్వహించారు.

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధర్మపరిరక్షణ యాగం చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన యాగం ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా క్షేమం, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గణపతి పూజతో స్వయంగా అంకురార్పణ గావించారు. సోమవారం ఉదయం 6గం.55 నిమిషాలకు పవన్ కళ్యాణ్ సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాల ధారణలో యాగశాలకు వచ్చి దీక్ష చేపట్టారు. ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో విలసిల్లాలనే ఆకాంక్షతో దేవతామూర్తులకు ప్రణతులు అర్పించారు. యాగశాలలో అయిదుగురు దేవతామూర్తులను ప్రతిష్టాపించారు.
ధర్మ పరిరక్షణ.... ప్రజా క్షేమం... సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ యాగం చేపట్టిన శ్రీ @PawanKalyan గారు pic.twitter.com/LzRtobQzCC
— JanaSena Party (@JanaSenaParty) June 12, 2023
స్థిరత్వం, స్థితప్రజ్ఞత ప్రసాదిత దేవత గణపతి, శత్రు, శత్రుత్వ నిరోధిత దేవత చండీ మాత, అష్టైశ్వర్య ప్రసాదాధిపతులు శివపార్వతులు, ఆయురారోగ్య ప్రదాత సూర్య భగవానుడు, ధార్మిక సమతుల్యత.. త్రిస్థితియుక్త కారకుడు శ్రీ మహావిష్ణువు ఈ యాగపీఠంపై పరివేష్టితులై ఉన్నారు. ఈ ఐదు దేవతా మూర్తులకు అభిముఖంగా యంత్ర స్థాపన చేపట్టారు. విగ్రహం.. యంత్రం.. హోమం ఆలంబనగా ప్రారంభమైన ఈ యాగం మంగళవారం కూడా కొనసాగుతుంది. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలోని విశాల ప్రాంగణంలో యాగశాల రూపుదిద్దుకుంది. యాగ సంప్రదాయ మేళవింపులో భాగంగా మామిడి తోరణాలు, పూలహారాలు, అరటిచెట్లు, రంగవల్లుల అలంకరించారు. హడావిడి, ఆర్భాటం లేకుండా కేవలం రుత్వికులు మాత్రమే సంప్రదాయ బద్దంగా నిర్వర్తిస్తున్నారు.
అదే సమయంలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు.
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి భూమి పూజ
— JanaSena Party (@JanaSenaParty) June 12, 2023
Video link: https://t.co/PUnFVpPQlw pic.twitter.com/6PB06qNUdG
పధ్నాలుగో తేదీన వారాహి వాహనానికి అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పూజాకార్యక్రమాలు అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి నుంచి భారీ సభ అనంతరం వారాహి యాత్ర ప్రారంభం అవుతుందని ఇప్పటికే జనసేన నాయకత్వం ప్రకటించింది. కాకినాడ జిల్లా నుంచి ముమ్మిడివరం నియోజకవర్గం ద్వారా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోకి వారాహి యాత్ర ఎంటర్ కానుంది.ఇప్పటికే కాకినాడ జిల్లా పరిధిలో ఈనెల 14న ప్రారంభమయ్యే యాత్రలో రోడ్‌షో, కత్తిపూడి జంక్షన్ వద్ద బహిరంగ సభ, 16న పిఠాపురంలో రోడ్‌షో, సాయంత్రం బహిరంగ సభ,ఆ తరువాత 18న కాకినాడలో రోడ్‌షో, సాయంత్రం బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిపై ఇప్పటికే కాకినాడ పోలీసులకు అనుమతులకోసం దరఖాస్తు చేయగా పోలీసులనుంచి అనుమతులు లభించాయి.
ఇక ముమ్మిడివరం నియోజకవర్గం ద్వారా అమలాపురం చేరుకుని 20న రోడ్‌షో, బహిరంగ సభ జరగనుండగా 22న పి.గన్నవరం నియోజకవర్గం నుంచి రాజోలు నియోజకవర్గం చేరుకుని అక్కడ రోడ్‌షో, బహిరంగ సభ నిర్వహించేందుకు రూట్‌మ్యాప్ సిద్ధం చేశారు. దీనిపై సోమవారం జిల్లా ఎస్పీ శ్రీధర్‌ను కలిసి అనుమతులు కోరనుండగా ఆదివారం అమలాపురం డీఎస్పీ అంబికాప్రసాద్, అమలాపురం సీఐ లు కలిసి జనసేన నాయకులతో కలిసి రూట్ మ్యాప్‌ను పరిశీలించారు.





















