Visakha News: 'మోదీజీ గంజాయి రాజధాని అనే చెడ్డపేరు తొలగించండి' - జన జాగరణ సమితి ఫ్లెక్సీ
Jana Jagarana Samiti: విశాఖ నగరం గంజాయికి రాజధాని అన్న చెడ్డపేరు తొలగించాలని జన జాగరణ సమితి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఓ ఫ్లెక్సీని ప్రభుత్వ అధికారి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసింది.
Jana Jagarana Samithi Flexi On Visakha Ganza Issue: విశాఖలో (Visakha) గంజాయి సమస్య తీవ్రమైందని పేర్కొంటూ జన జాగరణ సమితి (Jana Jagarana Samiti) ప్రభుత్వ అధికారి కార్యాలయం వద్ద ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) దృష్టికి సమస్యను తీసుకెళ్లేలా.. 'మోదీజీ విశాఖ గంజాయికి రాజధాని అన్న చెడ్డ పేరును దయచేసి తొలగించండి.' అంటూ మధురవాడ రిజిస్టార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో అభ్యర్థించింది. 'ప్రపంచంలోనే అధిక శాతం యువత ఉన్న మన దేశంలో లక్షలాది మంది గంజాయి మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన యువశక్తి నిర్వీర్యం అవుతోంది. మరీ ముఖ్యంగా ఏపీలో ఎక్కడ చూసినా గంజాయి విచ్చలవిడిగా అందరికీ అందుబాటులో ఉండడం వల్ల స్కూల్ పిల్లల నుంచి యూనివర్సిటీ విద్యార్థుల వరకు గంజాయికి బానిసలు అవుతున్నారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు విశాఖ ఏజెన్సీతో ముడిపడి ఉంటున్నాయి. దేశం మొత్తం 7 లక్షల కేజీలు గంజాయి పట్టుబడితే అందులో 5 లక్షల కేజీలు విశాఖ ఏజెన్సీకి సంబంధించినదని అధికారికంగా నిర్ధారించబడింది. అందువల్ల విశాఖ దేశంలోనే గంజాయి రాజధానిగా బాగా ప్రసిద్ధి చెందింది. గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 25 శాతం మాత్రమే విజయవంతమైంది. ఎందుకంటే అంతర్జాతీయ గంజాయి ముఠాల ఆట కట్టించాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుంది. ఇది ఎన్నికల సమయం కాబట్టి విశాఖ ఏజెన్సీలో గంజాయి సమస్యను జాతీయ సమస్యగా గుర్తించి బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి విశాఖ.. గంజాయికి రాజధాని అన్న చెడ్డ పేరును దయచేసి తొలగించండి.' అని ప్రధానికి జన జాగరణ సమితి విజ్ఞప్తి చేసింది.
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన
మరోవైపు, ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మార్చి 4న ఆయన ఆదిలాబాద్ జిల్లాలో, మార్చి 5వ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ మోదీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అంతే కాకుండా, మోదీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని మోదీ జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. అనంతరం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నట్టు సమాచారం. మరోవైపు మార్చి 4న తెలంగాణలో జరగాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన రద్దైంది.
ఇదీ షెడ్యూల్
మార్చి 4న ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు ఆదిలాబాద్‌లో కొన్ని కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేస్తారు. 11.15 గంటల నుంచి 12 గంటల వరకు ఆదిలాబాద్ లోనే బహిరంగ సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు రాత్రికల్లా హైదరాబాద్ చేరుకొని హైదరాబాద్ రాజ్ భవన్‌లో బస చేస్తారు. ఈలోపు బీజేపీ నాయకులతో సమావేశాలు ఉంటాయి. మార్చి 5న సంగారెడ్డిలో పర్యటన ఉండనుంది. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని రాజ్ భవన్ నుంచి బయలుదేరి ఉదయం 10.45 నుంచి 11.15 వరకు వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం ఉదయం 11.30 నుంచి 12.15 వరకు సంగారెడ్డిలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. దాంతో ప్రధాని పర్యటన తెలంగాణలో ముగుస్తుంది. అనంతరం ప్రధాని ఒడిశా వెళ్లనున్నట్లు తెలిసింది.
Also Read: Sharmila News: అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ మథనం- ఆశావాహులకు షర్మిల ఇంటర్వ్యూ