Sharmila News: అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ మథనం- ఆశావాహులకు షర్మిల ఇంటర్వ్యూ
Sharmila Interviews: పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారితో నేడు, రేపు షర్మిల ముఖాముఖి నిర్వహించనున్నారు
Andra Pradesh Elections News: ఏపీలో ఎన్నికల హడావుడి ఊపందుకోవడంతో కాంగ్రెస్(Congress) పార్టీ సైతం అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించింది. ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ పార్టీ...నేడు(గురువారం), రేపు(శుక్రవారం) పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి(Sharmila) ఇంటర్వూ చేయనున్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో దరఖాస్తుదారులతో ఆమె నేరుగా మాట్లడనున్నారు..
షర్మిల ఎన్నికల కసరత్తు
ఏపీ(AP)లో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. అధికారపార్టీ రెండు నెలల నుంచే మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టగా...ప్రధాన ప్రతిపక్షం ఒక అడుగు ముందుకేసి 99మందితో తొలిజాబితా సైతం విడుదలచేసి ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన పాపం మూటగట్టుకుని ఏపీలో మట్టిగొట్టుకుపోయింది. దశాబ్దకాలంపాటు ఆ పార్టీ తరపున కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులే లేకుండాపోయారు.అయితే ఇటీవలే వైఎస్ షర్మిల పీసీసీ పగ్గాలు చేతబట్టడంతో కాంగ్రెస్ పార్టీ కొత్త ఊపిరిపోసుకుంది. బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన షర్మిల...పాతతరం కాంగ్రెస్ నాయకులను కలుస్తూ పార్టీలో మళ్లీ క్రియాశీలంగా వ్యవహరించాలని కోరింది. దీంతో పెద్దఎ్తతున కాంగ్రెస్ పార్టీలో నాయకులు చేరారు. చాలారోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కళకళలాడుతున్నాయి. ఎన్నికల్లో పోటీచేయాలని ఆసక్తి ఉన్నవారి నుంచి కాంగ్రెస్ దరఖాస్తులు ఆహ్వానించింది. తొలిరోజే పెద్దఎత్తున ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. జనవరి 24 నుంచి ఇప్పటి వరకు చాలా దరఖాస్తులు వచ్చాయి,
షర్మిల ముఖాముఖి
అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో నేడు, రేపు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ముఖాముఖి నిర్వహించనున్నారు. విజయవాడ(Vijayawada)లోని ఆంధ్రరత్న భవన్ లో అభ్యర్థులతో ఆమె మాట్లాడనున్నారు. ఇవాళ నర్సాపురం, ఏలూరు, నరసరావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఆశావాహులతో చర్చలు జరపనున్నారు. ఈ పార్లమెంట్ స్థానాల పరిధిలో ఉన్న 49 అసెంబ్లీ నియోజక వర్గాలలో పోటీ చేసేందుకు 280 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. అర్ధరాత్రి 1 గంట వరకు ఈ ప్రక్రియ సాగనుంది. రేపు మిగతా 9 పార్లమెంట్ స్థానాలు..అయా స్థానాల పరిధిలో ఉన్న 63 అసెంబ్లీ నియోజక వర్గాల దరఖాస్తుదారులతో ముఖా ముఖి నిర్వహిస్తారు. అభ్యర్థుల గుణగణాలు, ఆర్థిక పరిస్థితులు, గెలువు అవకాశాలు, పార్టీకి కమిట్ మెంట్ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు జనంలో లేకపోవడం, విభజన గాయాలు ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇప్పుడప్పుడే నిలదొక్కుకోవడం కష్టమేనని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అయితే షర్మిల రాకతో కొంత పరిస్థితులు మారాయని...వైఎస్ ఆర్ బిడ్డగా ఆమెపై కొంత సానుభూతి అయితే ఉంది. జగన్ ను వ్యతిరేకించేవారు, వైసీపీలో టిక్కెట్ రాక...తెలుగుదేశంలోనూ అవకాశాలు లేక మిగిలిపోియిన నేతలు కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రఘువీరారెడ్డి, శైలజానాథ్ వంటి నేతలు మళ్లీ క్రీయాశిలకంగా వ్యవహరించడం కొంత కలిసొచ్చే అంశం. అయితే ఇటీవల పార్టీలో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వెళ్లిపోవడంతో షర్మిల కొంత నిరాశ చెందారు. వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తే మరికొందరు చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ ఎదురుచూస్తోంది.