Janasena Jalsa : అప్పటి "జల్సా" ఇప్పుడు జనసేనకు రూ. కోటి ఇచ్చింది - ఇవిగో డీటైల్స్
జల్సా ప్రత్యేక ప్రదర్శనల ద్వారా వచ్చిన రూ. కోటిని జనసేనకు విరాళంగా ఇచ్చారు. వారిని నాగబాబు అభినందించారు.
Janasena Jalsa : జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు న ఆయన నటించిన ‘జల్సా’ చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పలు ధియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ చిత్ర ప్రదర్శన ద్వారా జనసేన పార్టీ కార్యకర్తలు రూ. కోటి విరాళాన్నిసేకరించారు. ఈ డబ్బును వారు పీఏసీ సభ్యుడు నాగబాబు చేతుల మీదుగా పవన్ కళ్యాణ్‌కు అందజేశారు. "నా సేన కోసం నా వంతు" అనే కార్యక్రమానికి జన సైనికుల నుంచి మంచి స్పందన వచ్చింది. పార్టీ కార్యకర్తలు, పవన్ అభిమానులు రూ. కోటి విరాళం సేకరించి అభిమానం చాటుకున్నారు. పవన్‌తో ఫొటో దిగాలి అన్న దానికే అభిమానులు పరిమితం కాకుండా.. ఏదైనా సాధించి, పార్టీ ఎదుగుదల, ఇటు సమాజ హితం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయం’’ అని నాగబాబు పేర్కొన్నారు.
"జల్సా" చిత్ర ప్రదర్శన ద్వారా రూ. 1 కోటి విరాళం సేకరించి అభిమానం చాటుకున్న జనసైనికులు..#నా_సేన_కోసం_నా_వంతు#Jalsa4K pic.twitter.com/gO3g25ayGs
— JanaSena Party (@JanaSenaParty) November 17, 2022
జల్సా సినిమా ఒక్క రోజు ప్రదర్శనలో ప్రపంచవ్యాప్తంగా 3.2 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని ఇంతకు ముందు ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను కూడా అప్పట్లో విడుదల చేశారు. 2008లో రిలీజ్ అయ్యిన ఈ సినిమాని మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత 4కే ప్రింట్ గా అప్డేట్ రిలీజ్ చేస్తే.. ఈ రేంజ్‌లో రెస్పాన్స్ రావడం మామూలు విషయం కాదని ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన జల్సా చిత్రంలో ఇలియానా డిక్రూజ్ హీరోయిన్. కమలినీ ముఖర్జీ, పార్వతి మెల్టన్, ప్రకాష్ రాజ్, ముఖేష్ రిషి, శివాజీ ముఖ్య పాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయితే సినిమాలు కూడా చేస్తున్నారు. పవన్ చేతిలో ఇప్పటికే మూడు సినిమాలు ఉన్నాయి. అవి పూర్తి అయ్యేసరికే ఎన్నికలు వస్తాయి. 2024 ఎన్నికలకు మరో ఏడాదిన్నర మాత్రమే ఉంది. పవన్ చేతిలో ఇప్పటికే మూడు సినిమాలు ఉన్నాయి. అవి పూర్తి చేయడమే కష్టమని అంటున్నారు. జనవరి నుంచి ఆయన రాజకీయ యాత్ర కూడా చేయాలనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ దశలో ఉంది. హరీష్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ స్ర్కిప్టుతో రెడీగా ఉన్నారు. ఇక వినోదయ సీతమ్ సినిమాకు సంబంధించి ఇటీవలే పూజాకార్యక్రమాలు జరిగాయి. సైలెంట్‌గా లాంచింగ్‌ను జరుపుకున్న ఈ సినిమాకు సముద్రఖని దర్శకుడు.
పార్టీని నడపడం అంటే చిన్న విషయం కాదని.. తన సంపాదనతోనే పార్టీని కూడా నడుపుతున్నానని జనసేన అధినేత చెబుతున్నారు. అందుకే సినిమాల విషయంలో వెనక్కి తగ్గడం లేదంటున్నారు. అయితే ఇప్పటి వరకూ వారాంతాలు లేదా షూటింగ్‌లు లేనప్పుడు మాత్రమే ఏపీలో రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వచ్చే జనవరి నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లో పాల్గొనాలంటే.. షూటింగ్‌లకు ప్యాకప్ చెప్పాల్సిందేనన్న వాదన వినిపిస్తోంది.