YS Jagan UK Tour: కోర్టు అనుమతితో లండన్ బయలుదేరిన సీఎం జగన్ - వీడ్కోలు పలికిన సీఎస్, మంత్రులు
AP CM YS Jagan leaves for London: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్ బయలుదేరారు జగన్.
AP CM YS Jagan leaves for London:
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరారు. సీబీఐ కోర్టు అనుమతి లభించడంతో గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్ బయలుదేరారు జగన్. గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చి సీఎస్ జవహర్ రెడ్డి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు జోగి రమేష్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఉన్నతాధికారులు సీఎం జగన్ కు వీడ్కోలు పలికారు.
వ్యక్తిగత పనుల మీద యూకే పర్యటనను జగన్..
సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత పనుల మీద యూకే పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 2 నంచి పన్నెండో తేదీ వరకూ ఆయన యూకే పర్యటనలో ఉండనున్నారు. సీఎం జగన్ కుమార్తెలు యూకేలో చదువుకుంటున్నారు. కుమార్తెల దగ్గర కొంత కాలం గడిపి రావాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగా వ్యక్తిగత పర్యటన కోసం సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకుని అనుమతి పొందారు. వైసీపీ ఎంపీ ఎంపీ విజయసాయిరెడ్డి వచ్చే ఆరు నెలల కాలంలో నెల రోజుల పాటు విదేశీ యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఎంపీ విజయసాయిరెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేశారు. విజయసాయిరెడ్డికి కూడా కోర్టు అనుమతి ఇవ్వడం తెలిసిందే.
జగన్, విజయసాయిరెడ్డి పిటిషన్లపై సీబీఐ కోర్టు తీర్పు
విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి రిక్వెస్ట్ పిటిషన్లపై సీబీఐ కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు వీరిద్దరికి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారు. గతంలో సీబీఐ అరెస్ట్ చేయడంతో బెయిల్ పై బయటకు వచ్చారు. బెయిల్ షరతుల్లో పాస్ పోర్టు కోర్టుకు సరెండర్ చేయాలని.. కోర్టు అనుమతితోనే విదేశాలకు వెళ్లాలన్న నిబంధన ఉంది. దాంతో వారిద్దరి పాస్ పోర్టు కోర్టు అధీనంలో ఉంటుంది. విదేశీ పర్యటనకు వెళ్లాలంటే వీరిద్దరూ కోర్టు అనుమతి తీసుకోవడం తప్పనిసరి అయింది. తాజాగా జగన్, విజయసాయిరెడ్డి వేర్వేరుగా విదేశీ పర్యటనలకు వెళ్తున్నట్లు పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు సీఎం తో పాటు ఎంపీకి అనుమతి ఇచ్చింది.
జగన్, విజయసాయిరెడ్డిల విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వొద్దని కోర్టులో సీబీఐ వాదించింది. జగన్, సాయిరెడ్డి దాఖలు చేసిన అభ్యర్థనలను తిరస్కరించాలని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. కేసులలో సాక్షులను వీరు ప్రభావితం చేసే అవకాశముందని, విదేశీ టూర్‌కు అనుమతివ్వొద్దని పిబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వివరించారు. అయితే సీబీఐ కోర్టు జగన్, విజయసాయిరెడ్డిలకు అనుకూల తీర్పు ఇచ్చింది, విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు క్విడ్ ప్రో కోకు పాల్పడినట్లుగా జగన్, విజయసాయిరెడ్డిపై కేసులు నమోదయ్యాయి. ఒకరి తర్వాత ఒకరు వరుసగా నిందితులు డిశ్చార్జి పిటిషన్ల వేస్తూండటంతో విచారణ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఇప్పటికే సీబీఐ వేసిన 8 ఛార్జిషీట్లలో నిందితుల డిశ్చార్జి పిటిషన్లపై విచారణ ముగిసింది. మరో 3 ఛార్జిషీట్లలో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ పెండింగ్ లో ఉంది. ఈడీ ఏడు ఛార్జిషీట్లలో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ ముగియగా.. మరో 4 ఛార్జిషీట్లలో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ జరుగుతోంది.