Why Jagan Silence On Bjp : బీజేపీ అగ్రనేతల విమర్శలపై జగన్ మౌనం - ఘాటుగా స్పందిస్తున్న ఇతర నేతలు ! డబుల్ గేమా ?
బీజేపీ అగ్రనేతల విమర్శలపై జగన్ మౌనం పాటిస్తున్నారు. అయితే ఇతర పార్టీ నేతలు మాత్రం ఘాటుగా స్పందిస్తున్నారు.
Why Jagan Silence On Bjp : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్న బీజేపీ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఇప్పటి వరకూ అందరికీ ఓ గట్టి నమ్మకం ఉంది. వైఎస్ఆర్‌సీపీ ఎలాంటి విషయాల్లోనూ కేంద్రానికి ఎదురు చెప్పకపోవడమే కాదు.. లఏ విషయంలోనూ కేంద్రాన్ని ప్రశ్నించిన సందర్భం కూడా లేదు. పైగా పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం వంటి విషయాల్లో బీజేపీ తరపున వకాల్తా పుచ్చుకుని ఇతర పార్టీలకు సీఎం జగన్ నీతులు కూడా చెప్పారు. అలాంటి సహకారం అందిస్తున్నా.. బీజేపీ అగ్రనేతలు మాత్రం జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
జగన్ పాలనపై ఘాటు విమర్శలు చేసిన అమిత్ షా, జేపీ నడ్డా
శనివారం రోజు తిరుపతిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. సీఎం జగన్ పాలనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పాలనా వైఫల్యాలపై తీవ్ర విమర్శలు చేశారు. పాలన అంతా స్కాములమయమేనన్నారు. ఆదివారం అమిత్ షా మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ సిగ్గుపడాలని కూడా అన్నారు. నిజానికి బీజేపీ ఏర్పాటు చేసుకుని జన సంపర్క్ అభియాన్ సభలు.. అంటే నరేంద్రమోదీ తొమ్మిదేళ్ల పాలనా విజయాలపై ప్రచారం చేయడానికే. కానీ ఏపీలో .. ప్రత్యేకంగా అప్రకటిత మిత్రుడిగా ఉన్న జగన్ ను టార్గెట్ చేయడంతో వైసీపీ స్పందనేమిటన్నది చర్చనీయాంశంగా మారింది.
జేపీ నడ్డా, అమిత్ షా వ్యాఖ్యలపై ఎలాంటి స్పందనా వ్యక్తం చేయని జగన్
బీజేపీ అగ్రనేతల విమర్శల తర్వాత సీఎం జగన్ క్రోసూరు సభలో పాల్గొన్నారు. తన సర్కార్ పై ఘాటు ఆరోపణలు చేసిన బీజేపీ అగ్రనేతలకు జగన్ గట్టిగా కౌంటర్ ఇస్తారని చాలా మంది అనుకున్నారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. తనకు బీజేపీ అండగా ఉండకపోవచ్చని మాత్రం చెప్పుకున్నారు. ఇప్పటి వరకూ బీజేపీ అండగా ఉందని.. ఇక ముందు ఉండకపోవచ్చన్న అర్థంలో మాట్లాడారు కానీ.. నేరుగా బీజేపీపై ఎటాక్ చేయాలని అనుకోలేదు. అందుకే మళ్లీ టీడీపీనే టార్గెట్ చేశారు.
మీ జగన్‌కు ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఢంకా బజాయించకపోవచ్చు. ఒక దత్తపుత్రుడు అండగా నిలబడకపోవచ్చు. మీ జగనన్నకు బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు. మీ జగనన్న వీళ్లను నమ్ముకోలేదు. దేవుడి దయను, మీ చల్లని ఆశీస్సులను మాత్రమే నమ్ముకున్నాడు.
— YSR Congress Party (@YSRCParty) June 12, 2023
- సీఎం వైయస్ జగన్ pic.twitter.com/z4hbWF1XHa
బీజేపీ అగ్రనేతలపై ఘాటు వ్యాఖ్యలు చేయడానికి పార్టీ నేతలకు గ్రీన్ సిగ్నల్
సీఎం జగన్మోహన్ రెడ్డి పల్లెత్తు మాట అనకపోయినా.. పార్టీ నేతలతో మాత్రం ఆయనపై విరుచుకుపడేలా కొంత మందికి పర్మిషన్ ఇచ్చారు. బయట నుంచి ఎవరి వచ్చి టీడీపీని పొడిగినా.. వైసీపీని విమర్శించినా.. పేర్ని నాని, కొడాలి నాని ఇద్దరికీ కౌంటర్ ఇవ్వాలనే సిగ్నల్స్ వెళ్తాయి. ఈ సారి కూడా వారిద్దరూ రంగంలోకి దిగారు. పేర్ని నాని పార్టీ ఆఫీసులో కూర్చుని జేపీ నడ్డాపై తీవ్రమైన విమర్శలు చేశారు. కొడాలి నాని కొన్ని మీడియా చానళ్లతో జేపీ నడ్డాపై అభ్యంతరక వ్యాఖ్యలు చేశారు. వీటిపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షాపై కూడా వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ .. టీడీపీ ట్రాప్ లో పడిందన్నారు.
అయితే జగన్ స్పందించకపోడంతో..దిగువస్థాయి నేతలు ఏం మాట్లాడినా.. ప్రజల్లో కి వెళ్లజం లేదు. బీజేపీ అగ్రనేతల ఆరోపణలపై స్పందించడానికి జగన్ సిద్ధంగా లేకపోవడంతో.. కేసుల భయమేనని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. వారు చేసిన ఆరోపణల్ని అంగీకరిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు.