(Source: Poll of Polls)
Anantapur News : మంత్రి పెద్దిరెడ్డిపై చెప్పులు - అవమానించిన సొంత పార్టీ కార్యకర్తలు - పెనుకొండలో ఏం జరిగిందంటే ?
సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి పెద్దిరెడ్డిపై చెప్పులు విసిసారు ఆ పార్టీ అసమ్మతి కార్యకర్తలు. ఎమ్మెల్యే శంకర్ నారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Anantapur News : ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో తీవ్ర అవమానం జరిగింది. ఆయనపై సొంత పార్టీ నేతలు చెప్పులు విసిరారు. పెనుకొండ వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి పెద్దిరెడ్డిని వై జంక్షన్ వద్ద ఎమ్మెల్యే శంకర నారాయణ వ్యతిరేక వర్గీయులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే శంకర్ నారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అసమ్మతి వర్గం రోడ్డుపై బైఠాయించింది. ఈ సమయంలో వాహనం దగ్గరకు వెళ్తున్న మంత్రి పెద్దిరెడ్డిపై చెప్పులు విసిరారు. రోడ్డుకు అడ్డంగా బైఠాయించి కాన్వాయ్‌ను అడ్డుకున్న కార్యకర్తలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఓ క్రమంలో సహనం కోల్పోయిన మంత్రి... కార్యకర్తలను దూరంగా నెట్టేశారు.
పెనుకొండలో నియోజకవర్గ విస్తృత సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన పెద్దిరెడ్డి
అసమ్మతి వర్గం నిరసన మధ్యనే పెద్దిరెడ్డి విస్తృత స్థాయి సమావేశానికి బయలుదేరారు. వాహనంలో కూర్చున్న ఎమ్మెల్యే శంకరనారాయణకు ఓ వైసీపీ కార్యకర్త చెప్పు చూపించాడు.శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో వైసీపీ నేతల్లో ఉన్న వర్గ పోరు తారస్థాయికి చేరింది. వైసీపీ అసమ్మతి నేతల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొనడం కలకలం రేపుతోంది. పెనుకొండ నియోజక వర్గ వైసీపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం ‘జగనన్న ముద్దు.. శంకర్ నారాయణ వద్దు’ అంటూ నినాదాలు చేసింది. మరో వర్గం ‘ధర్మవరం నాయకత్వం వద్దు… పెనుకొండ నాయకత్వం ముద్దు’ అంటూ నినాదాలతో హోరెత్తించింది. మాజీ మంత్రి శంకర నారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్ వాహనంపై ఆ వర్గం వారు చెప్పులు విసిరారు..
అడుగడుగునా ఆటంకాలు - చెప్పులు విసిరిన కార్యకర్తలు -
పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డికి అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు వరుసగా నిరసన లతో స్వాగతం పలికారు. ప్రతీ చోటా అసమ్మతి నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అసమ్మతి నేతలకు, పోలీసులకు మద్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. చివరకు మంత్రి పెద్దిరడ్డిని వేరే మార్గంలో పోలీసులు పెనుకొండ సమావేశానికి తరలించారు. .
అనంతపురం వైసీపీలో భగ్గమంటున్న వర్గ విభేదాలు !
అనంతపురం వైసీపీలో కొన్ని నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు నడుస్తున్నాయి. వీటిని సరిదిద్దడానికి హైకమండ్.. మంత్రి పెద్దిరెడ్డికి పని పురమాయించింది. ఆయన జిల్లాలో పర్యటించి.. విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి.. సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించి పార్టీ పరిస్తితులని చక్కదిద్దాలని చూస్తున్నారు. మొదట కళ్యాణదుర్గం నుంచే ఈ కార్యక్రమం మొదలు అయింది. అయితే ఏ నియోజకవర్గానికి వెళ్లినా అసంతృప్తి కనిపిస్తూనే ఉంది. అది పెద్దిరెడ్డి ఎదుట ఎక్కువగా బయటపడుతోంది. దీంతో ఆయనకూ అవమానాలు ఎదురవుతున్నాయి. వీటిని పెద్దిరెడ్డి సర్దుబాటు చేయాల్సి ఉంది. అయితే.. ఎవరూ మాట వినకపోవడంతో ఆయన కూడా అసహనానికి గురవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడిలో సెమిస్టర్ విధానం- మరో విప్లవానికి సిద్ధమైన గవర్నమెంట్