AP Elections: జమిలి అమల్లోకి వచ్చినా, 2029లోనే ఏపీలో ఎన్నికలు - ఏపీ సీఎం చంద్రబాబు
Andhra Pradesh News | జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదం పొందినా, 2029లో దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు ఉండవు. ఏపీలో అయితే ఇప్పట్లో ఎన్నికలు లేవని, 2029లోనే అని చంద్రబాబు తెలిపారు.
Elections in Andhra Pradesh will be held in 2029 | అమరావతి: పార్లమెంట్‌లో జమిలీ ఎన్నికల బిల్లు పెడుతున్న తరుణంలో దేశ వ్యాప్తంగా ఒకే దేశం ఒకేసారి ఎన్నికలపై చర్చ జరుగుతోంది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. దేశంలో జమిలి ఎన్నికలు అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే అని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. జమిలీకి ఆమోద ముద్ర లభిస్తే ఏపీలో 2027లో ఎన్నికలు జరిగే ఛాన్స్ అని కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రచారంపై సైతం చంద్రబాబు స్పందించారు. ఏపీలో ఇప్పట్లో ఎన్నికలు జరగవన్నారు.
వైసీపీ ఇప్పటికే ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయింది
మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టాగోష్టిలో మాట్లాడుతూ.. ‘ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మేం మద్దతు ప్రకటించాం. అయితే వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోంది. వైసీపీ నేతలు ఇదివరకే ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. వాళ్ల నాటకాలు చూసి ఏపీ ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రస్తుతంలో ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలి. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలతో పాటు ప్రతిచోటా చర్చ జరగాలని’ పేర్కొన్నారు.
2047 విజన్ సాకారం కోసం కృషి చేయాలి
విజన్ 2020 సాకారమైంది. రేపటి తరం భవిష్యత్తు కోసమే విజన్ 2047. ఇప్పడు గత పరిస్థితులను బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు మనకు కనిపిస్తున్నాయి. నెక్ట్స్ 2047లోనూ ఇదే పునరావృతం కానుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒకరోజు విడుదల చేసి వదిలిపెట్టేది కాదు. భవిష్యత్ తరాల బాగు కోసం అందరు భాగస్వాములు కావాలి. షెడ్యూల్ ప్రకారమే సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్రా ఎన్నికలు జరుగుతాయి. ఈసారి కలెక్టర్ల సదస్సులో ఎన్నో మార్పులు తీసుకొస్తాం. సుదీర్ఘ సమీక్షలకు బదులుగా ప్రశ్నలు, సమాధానాల రూపంలో నిర్వహిస్తాం. సమావేశాలు, సమీక్షకు ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు సంబంధించిన అంశాలు పంపించి సమాధానాలు కోరతాం. దాంతో సమయం సద్వినియోగంతో పాటు మంత్రులు, అధికారుల మధ్య సమన్వయం పెరుగుతుంది. - ఏపీ సీఎం చంద్రబాబు
అద్వానీ కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్ష
వయసురీత్యా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన బీజేపీ కురువృద్ధుడు అద్వానీ ఆరోగ్యంపై స్పందించారు. అద్వానీ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అద్వానీతో తనకు కొన్ని దశాబ్దాలుగా అనుబంధం ఉందన్నారు. గతంలో ఏపీ అభివృద్ధిలో కేంద్రం నుంచి అద్వానీ సహకారం మరువలేనిది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read: Jamili Elections: 2029 కూడా కాదు పూర్తి స్థాయి జమిలీ 2034లోనే - బిల్లులో బయటకు రాని సంచలన విషయం ఇదే!
2034లో జమిలీ ఎన్నికలు నిర్వహించే అవకాశం
జమిలీ ఎన్నికల బిల్లు పెట్టి ఆమోదం తెచ్చుకోవడం ఆసాధ్యమేమీ కాదు. కానీ దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు (Jamili Elections) ఎప్పుడు నిర్వహిస్తారన్న సస్పెన్స్ కొనసాగుతోంది. కేంద్రం తీసుకురానున్న బిల్లులో జమిలీ ఎన్నికలు పూర్తి స్థాయిలో 2034లో జరుగుతాయని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 2029లో పాక్షికంగా జమిలీ ఎన్నికలకు లైన్ క్లియర్ చేయనున్నారు. ఆ తరువాత ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.