Mekapati Goutham Reddy: మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం జగన్
ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. ఆయన భౌతిక కాయానికి సీఎం జగన్ నివాళులు అర్పించారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
మేకపాటి గౌతమ్‌రెడ్డి(Mekapati Goutham Reddy) పార్థివ దేహానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy) నివాళులు అర్పించారు. గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గౌతమ్ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి(Mekapati Rajamohan Reddy)ని ముఖ్యమంత్రి జగన్ ఓదార్చారు. సీఎం జగన్‌తో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy), ఎంపీ విజయసాయిరెడ్డి గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
అంతకు ముందు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణ వార్త తెలుసుకున్న సీఎం జగన్ దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు హైదరాబాద్(Hyderabad) బయలుదేరి వచ్చారు. గౌతమ్ రెడ్డి నివాసానికి వెళ్లి సీఎం జగన్ నివాళులు అర్పించారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోమవారం గుండెపోటు(Heart Attack)తో మరణించారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 8.45 నిమిషాలకు మరణించారు. గౌతమ్ రెడ్డికి వైద్యులు అత్యవసర సేవలు అందించినా ప్రాణాలు దక్కలేదు. వైఎస్ఆర్పీపీ(Ysrcp) కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్యనేతలు గౌతమ్‌రెడ్డి సంతాపసభ నిర్వహించారు. ఈ సభలో మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు హాజరయ్యారు. గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.
ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరిపించనుంది. ఎల్లుండి (ఫిబ్రవరి 23) మేకపాటి అంత్యక్రియలను నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం బ్రాహ్మణపల్లిలో నిర్వహిస్తారు. ఈ మేరకు బుధవారం (ఫిబ్రవరి 22) ఉదయం మేకపాటి భౌతిక కాయాన్ని నెల్లూరుకు తీసుకువెళ్లనున్నారు. నేడు సాయంత్రం వరకూ అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలోనే ఉంచనున్నారు.
మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం చాలా బాధాకరమని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) అన్నారు. గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి చంద్రబాబు నివాళులు అర్పించారు. గౌతమ్ రెడ్డి చాలా ఆక్టివ్ గా ఉండే వారని, వ్యాయమం మీద దృష్టి పెట్టే వ్యక్తి అని చంద్రబాబు అన్నారు. గౌతమ్ రెడ్డి తండ్రి రాజకీయం చూశానన్న చంద్రబాబు.... ఆయన చిన్న వయసులో మంత్రి అయ్యారన్నారు. వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి గౌతమ్ రెడ్డి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు.
Also Read: "గోల్డెన్ అవర్" కూడా రక్షించలేకపోయింది ! మేకపాటి విషయంలో క్షణక్షణం ఏం జరిగిందంటే ?