Andhra pradesh News: గర్భిణీ నరకయాతన, బిడ్డను ప్రసవించిన ఆస్పత్రికే భర్త మృతదేహం - ఏపీలో తీవ్ర విషాదం
Andhra pradesh News: ఏపీలో తీవ్ర విషాదం జరిగింది. ఓ గర్భిణీ ఆస్పత్రిలో చేరేందుకు 70 కి.మీ ప్రసవ వేదన పడగా, ప్రమాదంలో మరణించిన ఆమె భర్త మృతదేహాన్ని అదే ఆస్పత్రికి తరలించారు.
ఏపీ పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. ప్రసవ వేదన అనుభవించిన ఓ గర్భిణీ 3 గంటలుగా 3 ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. చివరకు 70 కి.మీల దూరంలోని ఓ ఆస్పత్రిలో చేర్చగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, తోడుగా వచ్చిన ఆమె భర్త డబ్బులు తీసుకువస్తానని వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. ఈ క్రమంలో స్థానికులు అతన్ని తన భార్య ప్రసవించిన ఆస్పత్రికే చికిత్స కోసం తరలించగా, ఇంతలోనే ప్రాణాలు కోల్పోయాడు. బిడ్డను కళ్లారా చూడక ముందే తండ్రి కన్నుమూశాడని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఏం జరిగిందంటే?
పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన రామాంజిని అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో శుక్రవారం రాత్రి 10 గంటలకు ఆమెను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ సదుపాయాలు సరిగా లేవని గురజాల ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో రాత్రి 11 గంటలకు గురజాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అక్కడ కూడా సదుపాయాలు లేవని నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సిఫారసు చేశారు. దీంతో చేసేదేమీ లేక గర్భిణీని కుటుంబ సభ్యులు 70 కిలోమీటర్ల దూరంలోని నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దారి పొడవునా ఆమె 3 గంటలుగా నరకయాతన అనుభవించింది. ఆస్పత్రిలో రామాంజిని పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
భర్తకు ప్రమాదం
అయితే, గురజాల వరకూ గర్భిణీకి తోడుగా వచ్చిన ఆమె భర్త ఆనంద్ ఇంటికి వెళ్లి డబ్బులు తెస్తానని బయలుదేరాడు. బైక్ పై ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ మార్గమధ్యంలో జోలకల్లు వద్ద రహదారిపై భారీ గుంతలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు, బాధితున్ని నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికే చికిత్స కోసం తరలించారు. ఆస్పత్రి వద్దకు చేరగానే ఆనంద్ మృతి చెందాడు. దీంతో బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
బిడ్డను చూడకుండానే
తనకు పుట్టిన బిడ్డను కనులారా చూడకుండానే ఆనంద్ కన్నుమూశాడని బంధువులు విలపించారు. భార్యను దగ్గరుండి చూసుకోవాల్సిన సమయంలో ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సమయంలో గర్భిణీలకు సాధారణ కాన్పులు కూడా చేయలేని స్థితిలో కారంపూడి, గురజాల ఆస్పత్రులు ఉన్నాయని విమర్శించారు. ప్రసవం కోసం 70 కి.మీల దూరంలోని ఆస్పత్రికి వెళ్లాల్సి రావడం బాధాకరమని వాపోయారు.
Also Read: జనసేన నేత కోటిరెడ్డి రాజారెడ్డిపై దాడి-వైఎస్‌ఆర్‌సీపీ పనే అంటూ ఆరోపణలు