Janasena Rajareddy Attaked: జనసేన నేత కోటిరెడ్డి రాజారెడ్డిపై దాడి-వైఎస్‌ఆర్‌సీపీ పనే అంటూ ఆరోపణలు
సత్యసాయి జిల్లా ధర్మవరంలో జనసేన నేత కోటిరెడ్డి రాజారెడ్డిపై దాడి జరిగింది. వైఎస్‌ఆర్‌సీపీ నేతలే దాడి చేశారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.
సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత నెలకొంది. జనసేన పార్టీ నేత కోటిరెడ్డి రాజారెడ్డిపై దాడి జరిగింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే అతనిపై దాడి చేసినట్టు చెప్తున్నారు. కోటిరెడ్డి రాజారెడ్డి... రాత్రి...తన ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో దాదాపు 20 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చుట్టుముట్టారు. ఒక్కసారిగా రాజారెడ్డిపై దాడి చేసినట్టు సమాచారం. ఈ దాడిలో కోటిరెడ్డి రాజారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.
ధర్మవరం పట్టణంలోని శివరామనగర్‌లో నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. కోటిరెడ్డి రాజారెడ్డిపై వైఎస్‌ఆర్‌సీపీ వర్గీయులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. వైఎస్‌ఆర్‌సీపీ నేత, యువజన నాయకుడు కుణుతూరు వినయ్‌గౌడ్‌తోపాటు మరో 20 మంది బైక్‌పై వచ్చి దాడి చేశారని రాజారెడ్డి చెప్తున్నారు. ఆయన తలకు తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసులు ఆయన్ను ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
రాజారెడ్డిపై దాడి చేసిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరా ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. బైక్‌పై వెళ్తున్న కోటిరెడ్డి రాజారెడ్డిని కొంత మంది అడ్డుకున్నారు. బైక్ దిగిన వెంటనే ఆయన్ను చుట్టుముట్టారు. వీరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పెద్ద పెద్ద కర్రలతో రాజారెడ్డిపై దాడి చేశారు. తీవ్రగాయాలు కావడంతో రాజారెడ్డి కింద పడిపోయాడు. దీంతో.. దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దాడిలో దాదాపు 10మంది వరకు పాల్గొన్నట్టు సీసీ ఫుటేజ్‌ను భట్టి తెలుస్తోంది.
కోటిరెడ్డి రాజారెడ్డి...జనసేన పీఏసీ సభ్యుడు, ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డికి సమీప బంధువు. బాధితుడిని మధుసూదన్‌రెడ్డి పరామర్శించారు. రాజారెడ్డిపై దాడి వెనుక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రమేయం ఉందని మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దుండగులు విచక్షణ రహితంగా దాడి చేయడానికి మధుసూదన్‌రెడ్డి ఖండించారు. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రోత్సాహంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేస్తుంటే జీర్ణించుకోలేక ఎమ్మెల్యే కేతిరెడ్డి తన అనుచరులతో దాడి చేయించారని ఆయన ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ధర్మవరం వన్‌టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న కోటిరెడ్డి రాజారెడ్డి దగ్గర స్టేట్‌మెంట్ తీసుకున్నారు. దాడి ఘటనపై ఆరా తీశారు. రాజారెడ్డి ఫిర్యాదు మేరకు వినయ్‌గౌడ్‌తో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.