Vangalapudi Anitha: 'పిన్నెల్లి పరామర్శకు రూ.25 లక్షల ఖర్చు' - మాజీ సీఎం జగన్‌పై హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం
Andhrapradesh News: జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు మాజీ సీఎం జగన్ రూ.25 లక్షలు ఖర్చు చేశారని రాష్ట్ర హోంమంత్రి అనిత ఆరోపించారు. ములాఖత్‌లు అయిపోయినా జగన్‌ను అనుమతించామన్నారు.
Home Minister Anitha Comments On Ys Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై (Jagan) రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) తీవ్ర విమర్శించారు. ఎన్నికల సమయంలో ఈవీఎం పగలగొట్టి జైలుకెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని (Pinnelli Ramakrishna Reddy) పరామర్శించేందుకు ఆయన రూ.25 లక్షలు ఖర్చు చేశారని ఆరోపించారు. పిన్నెల్లిని కలిసేందుకు ఆయన హెలికాప్టర్‌లో నెల్లూరు జైలుకు వెళ్లారని అన్నారు. మానవతా దృక్పథంతో జగన్‌కు పిన్నెల్లిని కలిసేందుకు అనుమతిచ్చామని.. జైలులో పిన్నెల్లిని కలిసేందుకు ములాఖత్‌లు అయిపోయాయని వెల్లడించారు. అనుమతి ఇచ్చే పరిస్థితి లేదని తెలిసినా.. ఉద్రిక్త వాతావారణం సృష్టించడానికే జగన్ ఈ ప్రయత్నం చేసినట్లు మండిపడ్డారు. ములాఖత్‌లపై జైళ్ల శాఖ ఐజీ నుంచి నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తానని పేర్కొన్నారు. జైలు నుంచి బయటకు వచ్చాక జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వెళ్లిపోయారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం హయాంలో అక్రమంగా పెట్టిన కేసులపై విచారణ జరిపిస్తామని.. న్యాయపరంగా చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు.
గంజాయి కట్టడికి ANTF ఏర్పాటు
అటు, రాష్ట్రంలో గంజాయిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో గంజాయి నివారణపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ గురువారం సమావేశమై చర్చించింది. బోర్డర్లలో చెక్ పోస్టులు పటిష్టం చేయాలని.. గంజాయి సాగును అరికట్టేలా కఠిన చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి వర్గం ఉపసంఘం ఆదేశాలిచ్చింది. గంజాయి నివారణకు పటిష్ట చర్యలు చేపడతామని.. ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ (ANTF) ఏర్పాటు చేస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. గంజాయి కట్టడి, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 'గిరిజన యువత సరైన ఉపాధి లేక పక్కదారి పడుతోంది. 80 శాతం గిరిజనులే గంజాయి క్యారియర్లుగా ఉన్నారు. జైళ్లల్లో 15 ఏళ్ల నుంచి గంజాయి రవాణా చేసిన గిరిజన యువకులు ఉన్నారు. గంజాయి బాధితులకు డీ-ఎడిక్షన్ సెంటర్లపై ఫోకస్ చేస్తాం. 100 రోజుల్లో గంజాయిని వీలైనంత వరకు కట్టడి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తాం. గంజాయి అరికట్టేందుకు పొరుగు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడతాం. ' అని పేర్కొన్నారు.
Also Read: Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు