Kadambari Jatwani case: నటికి వేధింపుల కేసులో ఐపీఎస్‌లకు ఊరట, ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ తీర్పిచ్చింది.
Mumbai Actress విజయవాడ: ఏపీలో సంచలనం రేపిన ముంబై నటి కాదంబరి జత్వానీ (Kadambari Jethwani) కేసులో ఐసీఎస్ అధికారులకు ఊరట లభించింది. ఐపీఎస్‌లు క్రాంతిరాణా, విశాల్ గున్నీ, హనుమంతరావులతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వర్లుకు సైతం హైకోర్టు ముందస్తు మంజూరు చేసింది. వైసీపీ హయాంలో ముంబై నటి కాదంబరి జత్వానీని ముంబై నుంచి ఏపీకి తీసుకొచ్చి వేధింపులకు గురిచేశారని ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక నటి జత్వానీ మరోసారి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
వైసీపీ హయాంలో వేధించారని జత్వానీ ఆరోపణలు
వైసీపీ హయాంలో ముంబై నటి కాదంబరి జత్వానీతో పాటు ఆమె కుటుంబంపై వేధింపులు జరిగాయని ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని రోజులకు ముంబై నటి విషయం వెలుగు చేసింది. గత ప్రభుత్వంలోని పెద్దల ఆదేశాలతో కొందరు పోలీసుల టీమ్ ముంబైకి వచ్చినట్లు జత్వానీ ఆరోపించారు. ఖరీదైన కార్లలో వచ్చిన పోలీసులు తనను, తన కుటుంబాన్ని విచారణ పేరుతో ఏపీకి తీసుకొచ్చి ఓ గెస్ట్ హౌస్ లో బంధించి వేధించారని నటి ఫిర్యాదు చేశారు. ఐపీఎస్ అధికారులు విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్నిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరితో పాటు ఇబ్రహీంపట్నం అప్పటి సీఐ హనుమంతరావు, లాయర్ వెంకటేశ్వర్ల పేర్లను సైతం కేసులో చేర్చి విచారణ చేపట్టారు.
ఈ కేసులో తమను అరెస్ట్ చేయకుండా చూడాలని వీరు హైకోర్టులో ముందస్తు బెయిల్ దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ఇదివరకే ఇరువైపుల వాదనలు ముగియగా తీర్పు రిజర్వ్ చేశారు. నటి కేసులో నిందితులకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు మంగళవారం నాడు తీర్పు వెలువరించింది. వైసీపీ నేతలపై విమర్శలు రాగా, ఉద్దేశపూర్వకంగా కేసులు బనాయించి అరెస్ట్ చేసే కుట్ర జరుగుతోందని వారు కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడి చేశారు.