YS Sharila on Arogyasri : ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు - పెండింగ్ నిధులు చెల్లించాలని షర్మిల డిమాండ్
YS Sharila on Arogyasri : పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్య శ్రీని వదిలించుకునే ప్రయత్నం జరుగుతోందని వైఎస్ షర్మిల ఆరోపించారు.
YS Sharila on Arogyasri : ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ పథకం నిలిచిపోవడంపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) చీఫ్ వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. పెండింగ్ లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎక్స్ లో పోస్ట్ చేసిన షర్మిల.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వాన్ని నిందించారు. పలు విమర్శలు చేస్తూనే తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.
రూ.3వేల కోట్లు తక్షణమే విడుదల చేయండి
పేదవాడి ఆరోగ్యానికి భరోసాగా నిలిచే ఆరోగ్య శ్రీ పథకాన్ని వదిలించుకునే ప్రయత్నం జరుగుతోందని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ పథకం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రిక అని చెప్పుకొచ్చారు. ఇదంతా పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు జరుగుతోన్న కుట్రనే అని షర్మిల విమర్శించారు. ఆరోగ్యానికి పెద్దపీట అంటూనే కత్తిపీట వేస్తున్నారని, ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ.. వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పెండింగ్ లో ఉన్న ఆరోగ్యశ్రీ నిధులు చెల్లించే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని చెప్పారు. వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని కోరారు. పెండింగ్ బకాయిలు రూ.3వేల కోట్లు తక్షణం విడుదల చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.
పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్య శ్రీ. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మానస పుత్రిక ఈ పథకం. ప్రాణాలు తీసే జబ్బొచ్చినా సంజీవని లాంటి ఆరోగ్య శ్రీ పథకాన్ని.. కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చింది. రూ.3వేల కోట్లు బకాయిలు చెల్లించకుండా, వైద్యసేవలు నిలిచే దాకా…
— YS Sharmila (@realyssharmila) January 7, 2025
అనారోగ్యశ్రీగా మారిన ఆరోగ్యశ్రీ
ప్రాణాలు తీసే జబ్బొచ్చినా సంజీవనిలా పనికొచ్చే ఆరోగ్య శ్రీ పథకాన్ని.. కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చిందని వైఎస్ షర్మిల మండిపడ్డారు. రూ.3వేల కోట్లు బకాయిలు చెల్లించకుండా, వైద్యసేవలు నిలిచే దాకా చూడటం గమనిస్తుంటే.. ఆరోగ్య శ్రీ పథకానికి మంగళం పాడేట్టుగానే ఉన్నారన్నారు. ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. గత ప్రభుత్వంపెండింగ్ లో పెట్టినవి అయినా సరే.. ఆరోగ్య శ్రీ పథకానికి బకాయిలను చెల్లించే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని షర్మిల అన్నారు. ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించి, పథకానికి ఏ లోటూ రాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంపై షర్మిల ఆందోళన
కొన్ని నెలల క్రితం కూడా షర్మిల ఆరోగ్యశ్రీ పథకం అమలుపై మాట్లాడారు. బకాయిల్లో కనీసం కొంత భాగాన్నైనా చెల్లించాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపడతామని ఆమె హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉన్న సేవలను ఎందుకు నిలిపివేస్తున్నారో ప్రజలు వివరించాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య ఖర్చులు భరించలేని పేదల సంక్షేమం కోసం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారని గుర్తు చేసిన ఆమె.. అనేక రాష్ట్రాలు సైతం ఆరోగ్యశ్రీని ఆదర్శంగా తీసుకున్నాయని అన్నారు. 2023 సెప్టెంబర్ నుంచి ఆరోగ్యశ్రీ పథకం అమలుకు నిధుల విడుదలను ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు.
Also Read : YSRCP vs Nara Lokesh: వైసీపీ ఏం పీకిందని నారా లోకేష్ సూటిప్రశ్న! దీటుగా బదులిస్తూ వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్