Harish Rao : చంద్రబాబు అరెస్ట్ దురదృష్టకరం - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు !
చంద్రబాబు అరెస్ట్ దురదృష్టకరమని హరీష్ రావు అన్నారు. ఈ అంశంపై కేటీఆర్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన తర్వాత హరీష్ స్పందించడం ఆసక్తికరంగా మారింది.
Harish Rao : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం దురదృష్టకరమని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శనివారం చంద్రబాబు అరెస్టుపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరం. పాపం ఈ వయస్సులో ఆయన అరెస్ట్ మంచిది కాదు. గతంలో ఐటీ, ఐటీ అన్నాడు.. కానీ, ఇప్పుడు చాలా మంచి మాట చెప్పారు. తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు తీసుకోవచ్చని చెప్పారు.ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన బాగుంది కాబట్టే చంద్రబాబు అలా అన్నారు” అని పేర్కొన్నారు.
ఇటీవల చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి కేటీఆర్ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అది ఏపీ రాజకీయమని.. తమకేం సంబంధం అని ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్‌లో ఆందోళనలు జరుగుతూంటే.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ అంశంపై నారా లోకేష్..ఫోన్ చేయించారని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో ఆందోళనలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని అడిగారని.. చంద్రబాబును అరెస్ట్ చేస్తే హైదరాబాద్‌లో ఆందోళనలు చేయడం ఏమిటని కేటీఆర్ అన్నారు. చంద్రబాబు అరెస్ట్ రెండు పార్టీలసమస్య అన్నారు. ధర్నాలు, ర్యాలీలు ఏపీలో చేసుకోవాలని.. తెలంగాణలో వద్దని స్పష్టం చేశారు.
ధర్నాలకు, ర్యాలీలకు అనుమతి ఇవ్వాలని లోకేష్ చేసినప్పుడే.. శాంతిభద్రతలు తమకు ముఖ్యమని చెప్పామన్నారు. ఎలాంటి ర్యాలీలు అయినా.. ఏపలో చేసుకోవాలన్నారు. జగన్ , పవన్ , లోకేష్ అందరూ తనకు స్నేహితులేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ మాటల్ని బట్టి.. హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగుల నిరసనల్ని ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా అడ్డుకుందని భావిస్తున్నారు. అయితే తెలంగాణలోని పలు చోట్ల చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో అనేక చోట్ల.. నల్లగొండ జిల్లా కోదాడతో పాటు హైదరాబాద్ నిజామాబాద్ వంటి చోట్ల కూడా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఎవరూ పెద్దగా అడ్డుకోవడం లేదు.
మరో వైపు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సహా అనేక మంది బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు అరెస్టును ఖండించారు. రాజకీయ కక్ష సాధింపుల కోసమే అరెస్టు చేశారని ఇలాంటివి రాజకీయాల్లో తగవన్నారు. ఎల్బీనగర్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ కూడా నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి కూడా ఖండించారు. అయితే వీరంతా తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా ఉండి.. చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్న వారే. తర్వాత రాజకీయ పరిణామాల్లో బీఆర్ఎస్‌లో చేరారు. గతంలో చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు కూడా. గత ఎన్నికలకు ముందు చంద్రబాబును తీవ్రంగా దూషించిన బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా చంద్రబాబు అరెస్టును ఖండించి.. ఓ రోజు దీక్ష చేసి.. జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.
ర్యాలీలు, నిరసనలు చేస్తే శాంతిభద్రతలు సమస్యలు వస్తాయని కేటీఆర్ ఎందుకు అనుకున్నారో కానీ.. బీఆర్ఎస్ లో ఉన్న నేతలు మాత్రం చంద్రబాబుకు మద్దతుగా ప్రకటనలు, ర్యాలీలు చేస్తున్నారు. అయితే ఇలాంటి ర్యాలీలు చేయవద్దని.. చంద్రబాబుకు మద్దతు వద్దని కేటీఆర్ ఎలాంటి ఆదేశాలు పార్టీ క్యాడర్ కు ఇవ్వలేదని భావిస్తున్నారు. అలా ఇచ్చి ఉన్నట్లయితే ఎవరూ మాట్లాడేవారు కాదని.. ర్యాలీలు నిర్వహించేవారు కాదని భావిస్తున్నారు. ఇప్పుడు హరీష్ రావు కూడా చంద్రబాబు అరెస్టు దురదృష్టకరమని స్పందించడంతో విస్తృత చర్చ జరుగుతోంది.