Sulabh Duty Cancel : మరుగుదొడ్ల దగ్గర డ్యూటీలు క్యాన్సిల్ - గుంటూరు సచివాలయ ఉద్యోగులకు ఊరట !
సచివాలయ కార్యదర్శులకు మరుగుదొడ్ల దగ్గర డ్యూటీలను గుంటూరు మున్సిపల్ కమిషనర్ క్యాన్సిల్ చేశారు. ప్రజారోగ్య కార్యకర్తలు వసూలు చేసే డబ్బులను రెవిన్యూ ఇన్స్‌పెక్టర్ కు ఇస్తే చాలని కొత్త ఉత్తర్వులు జారీ చేశారు.
గుంటూరులోని వార్డు సచివాలయాల అడ్మిన్, సెక్రటరీలకు సులభ్ కాంప్లెక్స్‌ల ( Sulabh Complex ) దగ్గర డ్యూటీలు వేయడం దుమారం రేపింది. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. గుంటూరు మున్సిపల్ కమిషనర్ ( Guntr Munsipal Commisinor ) సవరణ ఆదేశాలు జారీ చేశారు. మరుగుదొడ్ల వద్ద రుసుం వసూళ్లకు ప్రత్యేకంగా ప్రజారోగ్య వర్కర్స్ ను నియమించారు. అడ్మిన్ కార్యదర్శులు వర్కర్స్ వసూళ్లు చేసిన నగదుని ప్రాపర్ రిజిస్టర్ లో నమోదు చేసి.. సంబందిత రెవిన్యూ ఇన్స్పెక్టర్ కి అప్పగిస్తే చాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అడ్మిన్ కార్యదర్శులు మరుగుదొడ్ల వద్ద కూర్చొని రుసుం వసూళ్లు చేయాల్సిన పని లేదని ప్రకటించారు.
ఫిబ్రవరి 28వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మరుగుదొడ్ల వద్ద కూర్చుని డబ్బులు వసూలు చేసే బాధ్యతను 15మంది అడ్మిన్ కార్యదర్శులకు అప్పగించారు. ఒక్కో మరుగుదొడ్డికి ముగ్గురు చొప్పున నియమించారు. ఒక్కొక్కరు 8 గంటల చొప్పున ఒక్కో షిఫ్టులో పనిచేయాల్సి ఉంటుంది. ఉదయం 6 నుం చి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒకరు, మధ్యా హ్నం 2 నుంచి రాత్రి పది వరకు మరొకరు, రాత్రి పది గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఒకరు.. ఇలా అడ్మిన్ కార్యదర్శులు షిఫ్టులవారీగా పనిచేయాలి. వారి పేర్లను కూడా సర్క్యులర్‌లో పేర్కొన్నారు. వీరిలో మహిళా కార్యదర్శులూ ఉన్నారు. ఏ మరుగుదొడ్డి నుంచి రోజుకు ఎంత వసూలు చేయాలో కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక... మరుగుదొడ్ల కలెక్షన్ డబ్బు తీసుకుని మునిసిపాలిటీలో జమ చేసే బాధ్యతను ఓ రెవె న్యూ ఇన్‌స్పెక్టర్‌కు ( Revenue Inseptor ) అప్పగించారు.
ఈ ఉత్తర్వులు వివాదాస్పదం అయ్యాయి. సోషల్ మీడియాలో ( Social Media ) వైరల్ అయ్యాయి. సచివాలయ ఉద్యోగులకు మరుగుదొడ్ల వద్ద రుసుం వసూళ్ల పై సోషల్ మీడియా, ఇతర మీడియాల్లో వస్తున్న వార్తల పై కమిషనర్ సీరియస్ అయ్యారు. ఈ ఉత్తర్వులు ఇచ్చిన అదనపు కమిషనర్ నిరంజన్ రెడ్డికి సంజాయితీ నోటీసు జారీ చేశారు. కమిషనర్‌కు తెలియకుండానే నిరంజన్ రెడ్డి ఆ ఉత్తర్వులు ఇచ్చారని తెలుస్తోంది. గత ఆదేశాల్లో టార్గెట్‌లను కూడా పెట్టారు. ప్రస్తుత ఆదేశాల్లో ఎంత టార్గెట్ అనేది నిర్ణయించలేదు. వచ్చిన వసూళ్లను రెవిన్యూ ఇన్స్‌పెక్టర్‌కు ఇవ్వాలన్న సూచనలు ఉన్నాయి.