Nadendla Manohar : పవన్ ను తిట్టకపోతే పదవి పోతుందనే భయం పట్టుకుంది - నాదెండ్ల మనోహర్
Nadendla Manohar : ఉదయం పవన్ కల్యాణ్ తిట్టకపోతే సాయంత్రానికి పదవి పోతుందని మంత్రులకు భయం పట్టుకుందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
Nadendla Manohar : పవన్ కల్యాణ్ ను విమర్శించేందుకే వైసీపీ ప్రజాప్రతినిధులు రాజమండ్రిలో సమావేశం అయ్యారని జనసేన పీఏసీ నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చిన గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామస్థులతో మనోహర్ సమావేశమయ్యారు. ఇప్పటం గ్రామానికి పవన్ కల్యాణ్ రూ.50 లక్షలు విరాళం ఇచ్చారని ఆ నిధులు ఎలా వినియోగించాలనే అంశంపై గ్రామస్థులతో ఆయన చర్చించారు. గ్రామంలో కమ్యూనిటీ హాల్‌ను వైసీపీ నేతలు పడగొట్టి మళ్లీ కట్టించి, వైఎస్ఆర్ పేరు పెట్టారని గ్రామస్థులు నాదెండ్ల మనోహర్ కు తెలియజేశారు. విరాళాలతో నిర్మించిన బిల్డింగ్ కు వైఎస్‌ఆర్ పేరు ఎలా పెడతారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ను తిట్టకపోతే సాయంత్రానికి పదవి పోతుందని కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలకు భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే సీఎం జగన్ పాలనలో కాపు ప్రజానీకానికి చాలా చేశామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుల ధాన్యం డబ్బును కూడా కులాలవారీగా జమ చేయడం దౌర్భాగ్యమని మండిపడ్డారు.
రాజమండ్రిలో వైసీపీ కాపు నేతల సమావేశం
పవన్ విచక్షణ కోల్పోయి ఉన్మాదిలా మాట్లాడుతున్నారని వైఎస్ఆర్‌సీపీ కాపు నేతలు మండిపడ్డారు. ఆ పార్టీకి చెందిన కాపు సామాజికవర్గ నేతలంతా రాజమండ్రిలో సమావేశం అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పీఆర్‌పీకి ద్రోహం చేసినవారికి సమాధానం చెబుతానన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు వాళ్లతోనే స్నేహం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు దగ్గరై కాపు సామాజిక వర్గాన్ని కించపరుస్తున్నారని.. చంద్రబాబును సీఎం చేసేందుకే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న పవన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని విచక్షణ కోల్పోయి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారన్నారు. పవన్ వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు.
కాపులకు జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారన్న నేతలు
వైఎస్ జగన్ ప్రభుత్వం కాపులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని వైఎస్సార్‌సీపీ కాపు నేతలు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే టికెట్ల నుంచి నామినేటెడ్ పదవుల వరకూ కాపులకు సీఎం వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు కాపులను ఓటు బ్యాంక్‌గానే చూశాయని, వైఎస్ జగన్ ప్రభుత్వం కాపులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కాపు సామాజిక వర్గానికి సీఎం జగన్ కాపుల సంక్షేమానికి శ్రీకారం చుట్టారని.. ఆర్థికంగా అభివృద్ధి చెందే విషయంలో కాపులకు అండగా నిలిచారన్నారు. కాపుల సమస్యలు ఉంటే సీఎం జగన్ దృష్టికి తీసుకెళతామన్నారు. పవన్ పై నేరుగా బొత్స విమర్శలు చేయలేదు. ఇటీవల ఓ పార్టీ సెలబ్రిటీ అధినేత మాట్లాడిన మాటలను ఖండిస్తున్నామని.. త్వరలో విజయవాడలో కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామని బొత్స ప్రకటించారు.
రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు మోసం చేశారు!
కాపులకు సీఎం జగన్ పెద్ద పీట వేశారని, గతంలో రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేయడమే కాకుండా ముద్రగడ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశారని అంబటి రాంబాబు ఆరోపించారు. పవన్ కల్యాణ్ కాపు ఎమ్మెల్యేలను పవన్ దూషించడాన్ని ఖండిస్తున్నామన్నారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తి దిగజారి మాట్లాడతారా?, రంగా మరణానికి పవన్ కల్యాణ్ కొత్త భాష్యం చెప్పారన్నారు. రంగా హత్యకు కారణమైన చంద్రబాబుతో పవన్ జట్టుకట్టారని ఆరోపించారు. టీడీపీ హయాంలో కాపులను వేధిస్తే.. సీఎం జగన్ అన్ని రకాలుగా అండగా నిలిచారన్నారు. పవన్ ముసుగు తొలగిందని, కాపు సోదరులు ఆ విషయం గుర్తించాలని మంత్రి అంబటి రాంబాబు పిలుపునిచ్చారు.